Gossip Garage : ఆయన అధినేతనే టార్గెట్ చేశారు. కోటరీ మాటలు వినడం జగన్ తప్పే అంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు కీలక కేసులు వైసీపీని నిండాముంచేలా కామెంట్స్ చేశారు. కానీ ఆ నేత మీద ఫ్యాన్ పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. ఒకరిద్దరు నేతలు కౌంటర్ ఇచ్చినా.. సాఫ్ట్‌గా సుతిమెత్తగా సున్నితంగా మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీని టెన్షన్ పెడుతున్నారా? ఆయనను టార్గెట్ చేస్తే ఇక్కా ఇరికిపోతామని భావిస్తున్నారా?
జగన్ తర్వాత ఆయనే. వైసీపీలో నెంబర్ టు అన్నట్లుగా విజయసాయిరెడ్డి పేరు ప్రచారం జరిగేది. ఆయన కూడా ఆఫ్ ది రికార్డులో అలాగే చెప్పుకునేవారట. ఏమైందో తెలియదు కానీ జగన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయికి కొన్నాళ్లుగా గ్యాప్ ఏర్పడింది. పార్టీ పవర్ నుంచి దిగిపోయాక దూరం మరింత పెరిగి.. వైసీపీకి, ఎంపీ పదవికి..రాజకీయాలకు కూడా రాంరాం చెప్పేశారు విజయసాయిరెడ్డి.
వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసే ప్రయత్నం…
ఆ తర్వాత విశ్వసనీయత, విలువలు అంటూ జగన్ చేసిన కామెంట్స్‌కు ట్వీట్‌తో రిప్లై ఇచ్చి హాట్ టాపిక్ గా నిలిచారు. లేటెస్ట్‌గా సీఐడీ విచారణకు హాజరైన తర్వాత.. మీడియా ప్రతినిధులు ప్రశ్నించని అంశాలను కూడా మాట్లాడి..వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూ వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది.
Also Read : పవన్ కల్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? అందరి చూపు జనసేన ప్లీనరీ వైపే..
జగన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పూర్తిగా బద్దశత్రువుగా మాట్లాడుతున్నారని నేతలు షాక్ అవుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వెనకాడుతున్నారట. ఎటుపోయి ఎటొస్తుందో.. ఎన్నికలకు ముందు విజయసాయి మళ్లీ వైసీపీలోకి రావొచ్చు. ఎందుకొచ్చిన తంటా అంటూ కొందరు నేతలు విజయసాయి కామెంట్స్ మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారట.
అంతేకాదు వైసీపీ పెద్దలు కూడా ఈ అంశంలో పెద్దగా రియాక్ట్ కావొద్దన్నట్లు పార్టీ నేతలకు, అధికార ప్రతినిధులకు హింట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. నెల్లూరుకు చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన గుడివాడ అమర్నాథ్ మాత్రమే విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు పడితే వాళ్లు మాట్లాడి విజయసాయిని ఇంకా రెచ్చగొడితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారట.
పర్సనల్‌గా టార్గెట్ చేస్తే ఆయన ఇగో హర్ట్ అయ్యే అవకాశం..!
పర్సనల్‌గా టార్గెట్ చేస్తే ఆయన ఇగో హర్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారట. జగన్ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించిన విజయసాయి..కోటరీ అంటూ గట్టిగా టార్గెట్ చేయడం వెనుక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారట. పార్టీ నేతలు ఎవరైనా విజయసాయి మీద పరుషంగా మాట్లాడితే..వాళ్లతో తామే మాట్లాడించామని అనుకుని ఆయన మరింత ఓపెన్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట వైసీపీ పెద్దలు. ఒకరి ఇద్దరి నేతల పేర్లను ప్రస్తావిస్తూ విజయసాయి ఓపెన్ స్టేట్ మెంటే ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు లీడర్లు మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. తమ మీద చేసిన ఆరోపణలను ఖండిస్తూ కనీసం ప్రెస్‌నోట్ కూడా ఇవ్వడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు.
నెల్లూరు నుంచి జగన్ కు నమ్మిన బంటుల్లో ఒకరైన కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయ సాయిరెడ్డిపై మండిపడ్డారు. రాజకీయాల నుంచి రిటైరై వ్యవసాయం చేస్తానని చెప్పి..మళ్లీ పాలిటిక్స్ మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయాల్సింది పోయి..మధ్యలో చంద్రబాబు లాగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నారని అంటోంది వైసీపీ. గతంలో గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయి రెడ్డినే అని..ఆయనకు మించిన కోటరీ ఇంకెవరుంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఒకరిద్దరు నేతలు. కానీ విజయసాయి చెప్పిన కాకినాడ సీపోర్టు వాటాల ఇష్యూ కానీ..లిక్కర్ వ్యవహారంపై కానీ ఎవరూ మాట్లాడటం లేదు.
ఆ అనుమానంతో ఆయనపై విమర్శలు చేయడానికి వెనుకంజ..!
మరోవైపు విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్నారట. ఈ అనుమానంతో కూడా ఆయనపై విమర్శలు చేయడానికి వెనకాడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీలోకి వెళ్తున్నారట..గవర్నర్ పదవి ఖాయమట అని..మీడియా సూటిగా అడిగినా విజయసాయిరెడ్డి మాత్రం ఏ సమాధానం చెప్పలేదు.
Also Read : చివరికి చిక్కీ, కోడిగుడ్లపైనా ఆయన ఫోటోలే.. జగన్ టార్గెట్‌గా లోకేశ్ మాస్ ర్యాగింగ్
మీడియా ప్రతినిధులకు సమాధానం చెప్పకపోయినా కనీసం ఖండించకపోవడం చూస్తుంటే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటరనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి మరి.