అధికారంలో లేకపోయినా బిజీబిజీగా వైసీపీ కీలక నేతలు, జగన్ అత్యంత సన్నిహితులు..! ఎందుకో తెలుసా

గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన మాజీ ప్రజాప్రతినిధులు... ఇప్పుడు అవే కష్టాలను ఎదుర్కోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Gossip Garage : ఏపీ వైసీపీ నేతల్లో చాలా మంది చాలా బిజీబిజీ… పార్టీ అధినేత నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో చాలా మందికి క్షణం కూడా తీరిక లభించడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక హడావుడి… అధికారంలో ఉండగా ఎప్పుడూ బిజీగా ఉన్న నేతలు… ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది కదూ… వారు ఎందుకంత బిజీగా ఉన్నారో తెలుసా..

కేసులు, కోర్టులు అంటూ తీరికలేకుండా గడపుతున్నారు..
బాబు బాగా బిజీ… ఇదేదో తెలుగు సినిమా టైటిల్‌ అనుకుంటున్నారు కదా… నిజమే… ఇప్పుడు ఈ సినీ టైటిల్‌ను వైసీపీ కార్యకర్తలు పదేపదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పార్టీలో ముఖ్యనేతలు… ప్రధానమైన పదవుల్లో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ఫుల్‌ బిజీగా మారిపోయారు. గతంలో అధికారంలో ఉండగా బిజీ.. బిజీగా గడిపిన వారు.. ఇప్పుడు కేసులు, కోర్టులు అంటూ తీరికలేకుండా గడపడటమే టాక్‌ ఆఫ్‌ ద ఏపీగా మారింది.

కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎందరో..
మాజీ సీఎం జగన్‌తోపాటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్‌ 2గా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కేసులు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య చాంతాడులా చాలా పెద్దగానే ఉంది. కాకపోతే ప్రధాన నేతలుగా చలామణీ అయిన వారిపై వరుస కేసులు నమోదవడం… ఆ కేసుల నుంచి రక్షణకు వారు కోర్టులు చుట్టూ తిరగడమే ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆ భయంతో నిత్యం లాయర్లతో టచ్ లో నేతలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేశ్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు… ఆ కేసు నుంచి ముందస్తు బెయిల్‌ పొందడంతో అగ్రిగోల్డ్‌ భూముల స్కాంను తెరపైకి తెచ్చారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి కుమారుడు, సమీప బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక మాజీ మంత్రిని నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో పలు అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం వీరిలో కొందరిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో కేసుల ముప్పు ఉందని భావిస్తున్న నేతలు అంతా ఎప్పుడూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటున్నట్లు చెబుతున్నారు.

జగన్ పై కేసు, పరారీలో వంశీ?
కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నుంచే…. గతంలో చోటుచేసుకున్న పలు సంఘటనలపై దృష్టిపెట్టింది. అప్పట్లో కేసులు నమోదు చేయనవి… కేసులు పెట్టినా యాక్షన్‌ తీసుకోని వాటిని తెరపైకి తేవడం వైసీపీ ముఖ్యనేతలు టెన్షన్‌ పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మాజీ సీఎం జగన్‌పై నమోదు చేసి కేసు ఒకటి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌ చేశారని జగన్‌తోసహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండ్‌పై కేసులు నమోదు చేశారు. ఇదే విధంగా గన్నవరం టీడీపీ అఫీసులో దాడి సంఘటనకు బాధ్యుడిగా మాజీ ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ రాకపోవడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పరిగణిస్తున్నారు పోలీసులు.

అప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అవే ఇబ్బందులు పడుతున్నారు..
ఇక మాజీ మంత్రి కొడాలి నాని, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇలా కేసులు ఎదుర్కొంటున్న వారంతా మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులే… ఒకదానిపై ఒక కేసు నమోదు చేస్తుండటం వల్ల… ఈ మాజీ నేతలు అంతా న్యాయవాదులు, కోర్టుల పనిపైనే ఎక్కువగా ఫోకస్‌ చేయాల్సివస్తోంది. వరుస కేసులతో ఏ కేసులో బెయిల్‌ వచ్చిందీ.. ఇంకా పెండింగ్‌లో ఉన్న బెయిల్‌ దరఖాస్తులు ఏవి? అన్న విషయాలు తెలుసుకోవడమే పెద్ద పనిగా మారిందంటున్నారు. ఇది గమనిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు.. అధికారం పోయినా వైసీపీ వాళ్లు బిజీగానే ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన మాజీ ప్రజాప్రతినిధులు… ఇప్పుడు అవే కష్టాలను ఎదుర్కోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న విశాఖ ఫైల్స్‌.. వైసీపీ నేతల్లో మరింత టెన్షన్..!

ట్రెండింగ్ వార్తలు