Botcha Satyanarayana: పవర్‌లో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా..30ఏళ్లుగా అక్కడ ఆయన మాటే శాసనం. విజయనగరం డీసీసీబీ పీఠం ఆయన కనుసన్నల్లోనే ఉండేది. కట్ చేస్తే ఇప్పుడు విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ పీఠం టీడీపీ కోటాలో ఉంది. డీసీసీబీ ఛైర్మన్‌గా బొత్స సత్యనారాయణ దగ్గరి బంధువైన కిమిడి నాగార్జున ఉన్నారు. ఫస్ట్ టైమ్ తన వర్గానికి కాకుండా ప్రత్యర్థికి డీసీసీబీ పీఠం దక్కడమే బొత్సకు సవాల్‌గా మారింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చక్రం తిప్పుతున్న బొత్సకు టీడీపీ యువనేత, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున రూపంలో ఇబ్బందులు తప్పట్లేదట. 30 ఏళ్లుగా బొత్సకు ఎదురులేని చోట నో ఎంట్రీ బోర్డు పెట్టిన నాగార్జున..తగ్గేదేలే అంటూ బొత్సతో డైలాగ్ వార్‌కు కూడా దిగుతుండటం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అవుతోంది. ఈ ఫైట్ కాస్త ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
విజయనగరం జిల్లా పాలిటిక్స్‌ను టీడీపీ అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోందట. దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్‌లో టీడీపీ రాజకీయాలు నడిచేవి. అశోక్ గజపతిరాజే జిల్లాలను శాసించే వారు. ఆయన గోవా గవర్నర్ పదవిలో ఉన్నారు. రాజు గారి కుమార్తె విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా రాజకీయాలను టీడీపీ హైకమాండ్ క్లోజ్‌గా పరిశీలిస్తూ వస్తోందట. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గాన్ని బీసీలను ప్రోత్సహిస్తూ వైసీపీ పట్టుని తగ్గించే ప్రయత్నం చేస్తోందట.
ఈ క్రమంలోనే యువకుడు కిమిడి నాగార్జునకు మరోసారి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం దక్కింది అంటున్నారు. ఇప్పటికే ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. దాంతో ఆయన ప్లేస్‌లో కొత్త వారికి పార్టీ పగ్గాలు ఇస్తారన్న చర్చ జరిగింది. ఈ కీలక పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడ్డా .. కిమిడి నాగార్జుననే డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ పదవి వరించింది. దూకుడు తత్వం..తన మార్క్ పాలిటిక్సే కిమిడి నాగార్జునకు ప్లస్ పాయింట్‌గా మారాయట. వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్సను ఢీకొట్టడమే కిమిడి నాగార్జునకు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు.
2019లో తొలిసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స చేతిలో ఓడిపోయిన కిమిడి నాగార్జున చెప్పుకోదగ్గ ఓట్లు సాధించారు. అంతేకాదు 2024 ఎన్నికల నాటికి పార్టీని అక్కడ పటిష్టం చేశారు..తాను పోటీ చేద్దామనుకున్నారు. కానీ ఆయన పెదనాన్న కిమిడి కళా వెంకటరావుకు పార్టీ టికెట్ ఇచ్చింది. అధినాయకత్వం నిర్ణయం ప్రకారం కళా వెంకట్రావ్ గెలుపునకు సహకరించారు కిమిడి నాగార్జున. ఆయన సిన్సియారిటీని గుర్తించిన పార్టీ అధిష్టానం డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చింది.
ఇక 2029లో కచ్చితంగా నాగార్జున పోటీ చేస్తారని అంటున్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌కు గెలిచి వస్తారని కూడా పార్టీ నమ్ముతోందట. జిల్లాలో సామాజిక వర్గం పరంగా బొత్సను ఎదుర్కోవాలంటే యువకుడు అయిన నాగార్జునే బెటర్ అని జిల్లా సారధిగా ఎంపిక చేశారని అంటున్నారు. ఇప్పటికే బొత్సతో ఢీ అంటే ఢీ అంటున్న కిమిడి నాగార్జున గతంలో ఎప్పుడూ లేనట్లుగా..సవాళ్లు విసురుతున్నారట.
విజయనగరంలోని పైడితల్లి ఉత్సవం సందర్భంగా బొత్సకు బిగ్ ఝలక్ ఇచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచారు. కొన్నేళ్లుగా డీసీసీబీ భవనంపై నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తూ వస్తోన్న బొత్స హవాకు బ్రేక్ వేశారు. దీంతో ఫస్ట్ టైమ్ మరో బిల్డింగ్ మీద నుంచి బొత్స పైడితల్లి ఉత్సవాలను చూడాల్సి వచ్చింది. అలా ప్రతి అంశంలో బొత్సను ఎదుర్కోవడంతో ఎక్కడా వెనకాడటం లేదు కిమిడి నాగార్జున. విజయనగరం జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు అలాగే ఎంపీ సీటుని గెలిపించాల్సిన బాధ్యతను కిమిడి నాగార్జున మీద పెట్టిందట టీడీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే నాగార్జునకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. అందుకే అటు డీసీసీబీ ఛైర్మన్ పోస్ట్..ఇటు జిల్లా పార్టీ పగ్గాలు రెండు పదవులు ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని కిమిడి నాగార్జున ఏ స్థాయిలో నెరవేరుస్తారో చూడాలి.
Also Read: ఏపీలో మళ్లీ జిల్లాల వివాదం.. రాయలసీమలో కొత్త డిమాండ్లు ఏంటి, సర్కార్ ప్లాన్ ఏంటి..