Gudivada Amarnath : ‘ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను.. ఇక రౌండ్ మొదలవుతుంది’ : గుడివాడ అమర్నాథ్ వార్నింగ్!
Gudivada Amarnath : ఇకపై హోంశాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి పెడతా.. ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తానని గుడివాడ అమర్నాథ్ అన్నారు. కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Gudivada Amarnath
Gudivada Amarnath : ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మంగళగిరిలోని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదు. మూడోసారి సమన్లు జారీ చేయడంతో అమర్ నాథ్ విచారణకు హాజరయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు కేవలం రాజకీయ సెటైర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలను అవమానించే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారు. అలాగే, కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజకీయ విమర్శ మాత్రమే :
మహిళా కమిషన్ విచారణలో ‘మేకప్ మంత్రి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరారని అమర్నాథ్ తెలిపారు. తాను మహిళా లోకాన్ని అవమానించలేదన్నారు. రాజకీయ విమర్శలో భాగంగానే ఆ వ్యాఖ్య చేశానని చెప్పినట్లు వెల్లడించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం నడిపిందని తీవ్రంగా ఆరోపించారు.
అలాగే ‘మీరు చేసే జాబ్స్ మా వాళ్లు చేయలేరు’ అన్న వ్యాఖ్యలపైనా కూడా కమిషన్ వివరణ అడిగిందన్నారు. ఆ మాటలు వేరే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరైనా ఆ వ్యాఖ్యలను తమకు నచ్చిన విధంగా అర్థం చేసుకుంటే దానికి తాను బాధ్యుడు కాదని కమిషన్‌కు వివరించినట్లు చెప్పారు. హోంమంత్రి అనిత తన శాఖ పనులపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారనే రాజకీయ వ్యాఖ్య మాత్రమే చేసినట్టు తెలిపారు.
నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనని చెప్పా :
విచారణ సందర్భంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అని కమిషన్ ప్రశ్నించిందని, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని చెప్పినట్లు అమర్నాథ్ చెప్పారు. తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని ‘మేకప్’ అనే పదం వాడితే అది మహిళా లోకాన్ని అవమానించినట్లుగా ఎలా అవుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Read Also : Kodali Nani : ఏపీ హైకోర్టులో కొడాలి నానికి భారీ ఊరట..!
ఈ సందర్భంగా ప్రభుత్వంపై కూడా అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. తమ అధినేత జగన్‌ను, పార్టీ నేతలను ఇష్టానుసారంగా విమర్శిస్తే ఎవరూ స్పందించరు కానీ తమ వ్యాఖ్యలపై మాత్రమే వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. సాయి కృష్ణ తల్లి అనుభవించిన బాధను చూసి మహిళా లోకం మొత్తం బాధపడుతోందని పేర్కొన్నారు.
ఒక ప్రజా ప్రతినిధి ఓ మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై హోంమంత్రి ఎందుకు స్పందించలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని పవన్ కళ్యాణ్ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రెండేళ్లలో ఎంతమంది మహిళలను తిరిగి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అరే.. తురే అంటే గట్టిగానే బదులిస్తాం :
డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ కూడా రాష్ట్ర హోంమంత్రిని చేతకాని మంత్రి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. నడిరోడ్డుపై ఓ మహిళపై దాడి జరిగినా చర్యలు తీసుకోలేని హోంమంత్రి ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అని విమర్శించారు. మహిళల గౌరవం గురించి తమకు ఎవరి దగ్గరా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇకపై తమను ‘అరే.. తురే’ అంటూ సంబోధిస్తే రాజకీయంగా గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
ఈసారి రౌండ్ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ పాదయాత్ర కూటమికి ‘పాడే యాత్ర’గా మారుతుందని వ్యాఖ్యానించారు. మీరు వంద అంటే.. మేం ఒకటి అంటేనే బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చివరిలో తాను ఇకపై హోంశాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేస్తానని అమర్నాథ్ అన్నారు. కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారంటూ రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని స్పష్టం చేశారు.
