నటి శ్రీరెడ్డికి బిగ్ షాక్..! ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. ఎందుకంటే..

దీంతో శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

నటి శ్రీరెడ్డికి బిగ్ షాక్..! ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. ఎందుకంటే..

Updated On : November 14, 2024 / 5:57 PM IST

Case On Sri Reddy : నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకుగాను శ్రీరెడ్డిపై మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితలపై గతంలో శ్రీరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టారని నిర్మల తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై శ్రీరెడ్డి అసభ్యకరకంగా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అలాగే మరిన్ని సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు సమాచారం.

అటు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి సైతం శ్రీరెడ్డిపై నిప్పులు చెరిగారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలపై శ్రీరెడ్డి తీరు జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు సీఐకి ఫిర్యాదు పత్రం అందించారు. ఇక, ఇప్పటికే శ్రీరెడ్డిపై రాజమండ్రి రూరల్ లోనూ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

అటు సినీ నటుడు పోసాని కృష్ణమురళిపైనా టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసభ్యకర పోస్టులు పెట్టారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సత్తనపల్లి, వినుకొండ, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులు నమోదయ్యాయి.

”గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీరెడ్డి రెచ్చిపోయింది. గత ఐదేళ్ల కాలంలో దారుణంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితల గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె తీరును గత ఐదేళ్లు అందరూ చూశారు. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా శ్రీరెడ్డి మాట్లాడింది. మహిళలు కూడా సిగ్గుపడేలా ఆమె మాటలు ఉన్నాయి. చంద్రబాబును, పవన్ ను ఉద్దేశించి అన్న మాటలకు శ్రీరెడ్డిని కఠినంగా శిక్షించాలి.

అందులో భాగంగానే నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీన్ని వెంటనే పరిశీలించి యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు వెంటనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. మళ్లీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా వెంటనే శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పద్మ పోలీసులను డిమాండ్ చేశారు.

Also Read : సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?