Heavy Flood Water : కడప జిల్లాలో వరద బీభత్సం

కడప జిల్లాలో  వరదలు బీభత్సం సృష్టించాయి.  జిల్లా అతలాకుతలం అయ్యింది. వరద బీభత్సంతో జిల్లాలోని  వందల ఎకరాల  పంట చేలు నీట మునిగాయి.

Heavy Flood Water :  కడప జిల్లాలో  వరదలు బీభత్సం సృష్టించాయి.  జిల్లా అతలాకుతలం అయ్యింది. వరద బీభత్సంతో జిల్లాలోని  వందల ఎకరాల  పంట చేలు నీట మునిగాయి. జమ్మలమడుగు మండంలోని చాలా గ్రామాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వరి, పసుపు, శనగ, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మండలంలోని ఉప్పలపాడు వాగు పొంగిపొర్లడంతో కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, కర్నూల్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండికోట జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 11గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు.

పెన్నా,కుందూ నది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు,ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలోని నందలూరు, చెయ్యేరు పరివాహకప్రాంతం పులపుతూరు గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది.

Also Read : Building Collapsed : కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం – ముగ్గురు మృతుల్లో ఇద్దరు చిన్నారులు

వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. పింఛా ప్రాజెక్ట్ నుంచి వచ్చిన నీటి ప్రవాహానికి నిమిషాల్లోనే రాజంపేట మండలంలోని 5 గ్రామాలు నీట మునిగాయి. పులపత్తూరు, మందపల్లి, రాజులపల్లి, రామాపురం, గుండ్లూరు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెయ్యేరు వరద ఉధృతి ఘటనలో 12 మృతదేహాలు లభ్యం అయ్యాయి.

పులివెందుల మండలం ఎర్రపల్లి చెరువు కు భారీ గా వర్షపు నీరు చేరుతోంది…. ఏ క్షణమైనా చెరువు తెగే అవకాశం ఉండటంతో పులివెందులలోని లోతట్టు ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఇస్లాంపురం గుంత బజార్లలోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు. వీరందరికీ పులివెందులలోని న్యాక్ బిల్డింగ్లో వసతి ఏర్పాట్లు చేసారు. లింగాల మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అథికారులు. చెరువులన్నీ నిండిపోయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి….రైతులు వేసిన పంటలు మొత్తం నీట మునిగి నాశనమైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద వరద నీటిలో నాలుగు బస్సులుచిక్కుకున్నాయి. వరద ఉధృతికి పల్లె వెలుగు బస్సుకొట్టుకుపోయింది. 12 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది.  మరో రెండు ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. మిగిలిని వారిని రక్షించేందుకు శుక్రవారం సాయంత్రం ఒక హెలికాప్టర్ కడప చేరుకుంది. చీకటి పడడంతో సహాయక చర్యలకు అవరోధం కలిగింది.

పాములూరు సమీపంలోని వాగులో ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ఉన్న డ్రైవర్ వరద ఉధృతికి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన ఆటోడ్రైవర్ పాములూరుకు చెందిన భాషాగా గుర్తించారు. అలాగే వేంపల్లెలోని పాపాగ్ని నదిలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు అధికారులు. తాళ్ల సాయంతో అతన్ని ఒడ్డుకు చేర్చారు. బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Also Read : CM YS Jagan Aerial Survey: వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

వర్ష బీభత్సం నుంచి కడప జిల్లా వాసులు ఇంకా తేరుకోలేదు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నాయి. రైల్వేకోడూరులోని గుంజనేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుంజనేరు వరద ధాటికి 20 ఇళ్లు కొట్టుకుపోయాయి.

ఇక రాజంపేటలో వరదలో ఆర్టీసీ బస్సులు చిక్కుకున్న ఘటనలో పదుల సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంలో 12 మంది ప్రయాణీకులను రెస్క్యూ టీమ్ రక్షించింది. ఇప్పటివరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. నందలూరు, పులపత్తూరు, మందపల్లి, రాజుపల్లి గ్రామాల్లో దాదాపు 30 మంది గల్లంతైనట్లు సమాచారం. జలదిగ్బందంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దించారు. అటు చెయ్యేరు నది వరద ఉధృతి రెండు ఘటనలో 12 మృతదేహాలు లభ్యమయ్యాయి.

రాజంపేట మండలం పులపత్తూరు ఘటనలో రెండు, మందపల్లి దగ్గర రెండు, రామాపురం బస్సు ఘటనలో మరో మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించింది. గుండ్లురు శివాలయంలో ఒకటి, గుండ్లురు మసీదులో మరొకరి డెడ్‌బాడీ లభ్యమైంది. నందలూరు మండలం అన్నయ్యగారిపల్లిలో మరో రెండు మృతదేహాలను కనుగొన్నట్లు రెవెన్యూ, పోలీసులు తెలిపారు. మిగిలిన వారి మృతదేహాల కోసం రెస్క్యూ సిబ్బంది యత్నిస్తోంది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతోనే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టులు తెగిపోతున్నా.. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయకపోవడమే ఇందుకు కారణమంటున్నారు.

భారీ వర్షాలు, వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో సీఎం వైఎస్.జగన్‌ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వర్షాల ప్రభావాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు