AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. 3 రోజులు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 11న తిరుపతి, నెల్లూరు.. 12న తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వానలు పడతాయని వివరించింది.
నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
నవంబర్ 9 నుంచి 11 వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు అల్పపీడనం కదిలే అవకాశం ఉందని, దీని కారణంగా రాగల మూడు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.