మొన్న విజయవాడ, ఇప్పుడు అనంతపురం.. బుడమేరులా ముంచెత్తిన పండమేరు..!

కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరింది.

Anantapur Rains : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పుట్టపర్తి, కొత్త చెరువులో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరుకోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెనుకొండ మండలంలో జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాలనీలు నీటమునిగాయి.

ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్ట తెగి పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

అనంతపురంపై పండమేరు వాగు విరుచుకుపడింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు ఇరువైపుల ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు వరద ప్రవాహం పెరగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పండమేరకు పోటెత్తిన వరదతో ఉప్పరపల్లి పంచాయితీ పరిధిలోని జగనన్న కాలనీ నీట మునిగింది.

విజయవాడ తరహాలోనే అనంతపురంలో వరద దెబ్బకు ఇళ్లన్నీ నీట మునిగాయి. వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే పనిలో ఉన్నారు అధికారులు.

రాప్తాడు నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. రామగిరి, ఎన్ ఎస్ గేట్, కనగానపల్లి, తగరకుంట రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సునీత పర్యటించారు.

గత 40 ఏళ్లలో ఎన్నడూ ఇంత పెద్ద వర్షం చూడలేదని ఉప్పరపల్లి కాలనీ వాసులు చెబుతున్నారు. బాధితులకు అన్ని విధాలుగా సాయం చేస్తామని, ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని ఎమ్మెల్యే సునీత చెప్పారు. భారీ వర్షానికి రాప్తాడు నియోజకవర్గంలో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, వెంటనే రైతాంగానికి సాయం చేయాల్సిందిగా కోరానని సునీత వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలకు పొంగిన బుడమేరు.. విజయవాడను ముంచెత్తిన సంగతి తెలిసిందే. బుడమేరు దెబ్బకు విజయవాడ నగరం చిగురుటాకులా వణికిపోయింది. లక్షలాది మంది ప్రజలను బుడమేరు నిరాశ్రయులను చేసింది. తీవ్రమైన ఆర్థిక నష్టం మిగిల్చింది. సరిగ్గా అదే రీతిలో.. అనంతపురంపై పండమేరు విరుచుకుపడింది. నగర శివారులోని ఈ వాగు.. సోమవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించింది. సుమారు 5 కాలనీలను పండమేరు ముంచెత్తింది. ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. వాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతోనే పండమేరుకు భారీ వరద వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీకి మరో తుఫాన్ ముప్పు..! ముంచుకొస్తున్న దానా, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!