ఏపీకి మరో తుఫాన్ ముప్పు..! ముంచుకొస్తున్న దానా, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వానలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Cyclone Dana : ఏపీకి మరో వాయు గుండం టెన్షన్ పట్టుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు దానాగా నామకరణం చేశారు. పారాదీప్ కు 700 కిలోమీటర్లు, సాగర్ ఐల్యాండ్స్ కు(వెస్ట్ బెంగాల్) 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ 25వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్ గా మారి పూరి(నార్త్ ఒరిస్సా)-సాగర్ ఐల్యాండ్స్(వెస్ట్ బెంగాల్) మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వానలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
‘తుఫాన్ ప్రభావం ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ పై ఎక్కువగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో 25వ తేదీన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపటి నుంచే బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు. ఉత్తర కోస్తాంధ్రలో ఉన్న పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశాం’ అని వాతావరణ అధికారి తెలిపారు.
ఇప్పటికే ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జన జీవనం స్థంభించింది. కుండపోత వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు మరో తుఫాన్ ముంచుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. పంట పొలాలు నీట మునిగి నష్టపోవాల్సి వస్తుందేమోనని కంగారు పడుతున్నారు.
Also Read : అన్‌స్టాపబుల్‌లో జైలు జీవితం గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఏడ్చేసిన ఆడియన్స్.. ప్రోమో వైరల్..