Chandrababu Anaparthi Tour : తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తన కాన్వాయ్ ను ఆపేయడంతో చంద్రబాబు వాహనం దిగారు. కాలినడకనే అనపర్తి సభకు బయలుదేరారు. పోలీసుల తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తామన్నారు చంద్రబాబు.
కాగా, అనపర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సభకు వెళ్తున్న చంద్రబాబును బిక్కవోలు దగ్గరే నిలిపివేయడానికి ప్రయత్నించారు. చంద్రబాబు కాన్వాయ్ కు బారికేడ్లు అడ్డంగా పెట్టగా.. వాటిని టీడీపీ కార్యకర్తలు తోసివేయడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలింది. బలభద్రపురం దగ్గర మరోసారి చంద్రబాబును అడ్డుకున్నారు పోలీసులు. పోలీస్ బస్సుని అడ్డంగా పెట్టి చంద్రబాబు కాన్వాయ్ ని నిలిపివేశారు. ఎంతసేపటికి పోలీసులు రోడ్డును క్లియర్ చేయకపోవడంతో కాన్వాయ్ దిగిన చంద్రబాబు కాలినడకన ముందుకు సాగారు. పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు వెంట నడిచాయి.
Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అనపర్తి పర్యటనకు కలెక్టర్, ఎస్పీ నిన్ననే అనుమతి ఇచ్చారు. అయితే, సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఇవాళ పోలీసులు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ నోటీసులపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. అనపర్తిలోనూ టీడీపీ సభకు కార్యకర్తలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ, వాటిని తోసుకుని టీడీపీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి వెళ్లారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
చంద్రబాబును అడ్డుకున్నారన్న సమాచారంతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. పోలీసులు తనకు సహకరించడం లేదన్న చంద్రబాబు, ఇకపై తాను కూడా పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నానని ప్రకటించారు. “మీరు చట్టప్రకారం పని చేయడం లేదు. మీరు నాకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారు? ఎవరో సైకో చెప్పాడని నన్ను ఆపేస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
1921లో మహాత్మాగాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఏర్పడిందని, తర్వాత కాలంలో అది దండియాత్రగా మారిందని, బ్రిటీష్ పాలన పతనానికి నాంది పలికిందని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు చంద్రబాబు. ఎంత మందిపై కేసులు పెడతారో నేనూ చూస్తా అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు చంద్రబాబు. ఇవాళ ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతున్నానని పిలుపునిచ్చారు. మీరు అనుమతిస్తారా.. లేదా నన్నే ముందుకు వెళ్లమంటారా? అంటూ పోలీసులకు అల్టిమేటమ్ ఇచ్చారు చంద్రబాబు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, చంద్రబాబు కాలినడకన అనపర్తి బయల్దేరారు. కాగా, చంద్రబాబు పర్యటనలో రోడ్ షోకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. తాము నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు.