HMPV : HMP వైరస్ కలకలం.. ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి సత్యకుమార్ యాదవ్

రాష్ట్రంలో ఉన్న తాజా ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు అందించాల‌ని అధికారులను ఆదేశించారాయన.

HMPV : ఏపీలో ఇప్ప‌టివ‌రకు ఎటువంటి హెచ్ఎంపీ వైరస్ కేసులు న‌మోదు కానందున ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అన్నారు. క‌ర్నాట‌క‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో ఏపీలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఉన్న‌తాధికారులను ఆదేశించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.

ల్యాబ్స్, కిట్లు, యాంటీ వైరల్ మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశం..
ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి వైద్య ఆరోగ్య శాఖల కార్య‌ద‌ర్శుల‌తో మాట్లాడి తెలుసుకోవాల‌ని స్పెష‌ల్ సీఎస్ కృష్ణ‌బాబును ఆదేశించారు మంత్రి స‌త్య‌కుమార్‌ యాదవ్. ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు వైజాగ్‌లో ఉన్న మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష‌ నిర్వహించారు.

రాష్ట్రంలో ఉన్న 10 ఐసీఎంఆర్‌, 9 వీడీఆర్ఎల్ ల్యాబులను స‌న్న‌ద్ధం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి టెస్టుల‌కు కావాల్సిన కిట్లు, యాంటీ వైర‌ల్ మందుల ల‌భ్య‌త‌పై అంచ‌నాలు త‌యారు చేయాల‌న్నారు.

Also Read : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!

పరిస్థితిని బట్టి ఎటువంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకోవాల‌న్నారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ఆదేశాల‌క‌ అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భ‌విష్య‌త్తులో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై విధివిధానాలను రూపొందించేందుకు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో ఉన్న తాజా ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు అందించాల‌ని అధికారులను ఆదేశించారాయన.

Also Read : 2025లో ప్రపంచాన్ని కలవరపెడుతున్న 11 కొత్త రోగాలు ఏంటి? బాబా వంగా, నోస్ట్రడామస్‌ చెప్పిందే నిజం అవుతుందా?

అటు దేశంలో HMPV కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హ్యుమన్ మెటా న్యుమో వైరస్ కేసుల సంఖ్య 6 కి పెరిగింది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ లో HMP వైరస్ కేసులు నమోదయ్యాయి. బెంగుళూరులో 2, చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ లో ఒకటి, కోల్ కతాలో ఒక కేసు వెలుగు చూశాయి.

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్ లు..
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అటు.. చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, COVID-19తో సహా పలు వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.