నన్ను అవమానించిన డీజీపీ ఆఫీసుకు కచ్చితంగా వెళ్తా: హోం మంత్రి వంగలపూడి అనిత

Vangalapudi Anitha: చంద్రబాబు నివాసంపై దాడి కేసులను పునర్విచారణ చేయిస్తామని చెప్పారు.

Leader Vangalapudi

తనను అవమానించిన డీజీపీ ఆఫీసుకు కచ్చితంగా వెళ్తానని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ మహిళగా తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. సోషల్ మీడియాలో తనను అనేక రకాలుగా, తన మనసు గాయపడేలా అవమానపరిచినప్పటికీ అవన్నీ తట్టుకొని నిలబడగలిగానని తెలిపారు.

ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతామని వంగలపూడి అనిత చెప్పారు. ఎవరికి అన్యాయం జరిగినా ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే విధంగా తమ పాలన ఉంటుందని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను పునర్విచారణ చేయిస్తామని చెప్పారు.

దళిత వర్గానికి చెందిన తనకు సీఎం చంద్రబాబు హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని వంగలపూడి అనిత తెలిపారు. తనకు హోం మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఙతలు చెబుతున్నానని అన్నారు. చంద్రబాబు అప్పగించిన గురుతర బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తానని అన్నారు.

Also Read: మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా: నారా లోకేశ్