ఏపీ కురుక్షేత్రంలో జనసేనాని సత్తా.. అదును చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టడంలో కీరోల్!

ఆయన లెక్క వేరు. అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిక్క వెనుక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది.

Pawan Kalyan Political Power : నమ్మిన సిద్ధాంతం కోసం.. అనుకున్న లక్ష్యం కోసం.. అతనిది అవిశ్రాంత పోరాటం. పదేళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2014లో టీడీపీకి సహకరించి.. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా.. ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం నాలుగేళ్లుగా శ్రమించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రధానంగా ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. చంద్రబాబుతో పొత్తుకు ససేమీరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదర్చడంలో పవన్ కీరోల్ ప్లే చేశారు.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలేకొద్ది గ్లాసు పదునెక్కుతోంది.. ఇది మరో సినిమాలోని డైలాగ్.. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. నాలుగు పెళ్లిళ్లు అంటూ హేళనలు, రెండుచోట్లా ఓడిపోయాడంటూ అవహేళనలు.. చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురుచూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిక్క వెనుక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది.

పవన్ కల్యాణ్ త్యాగం
ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణాలను విశ్లేషిస్తే.. ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం.. పవన్ కల్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు.. ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనుకడుగు వేయలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు పేలాయి. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ ఎత్తిపొడుపు మాటలు వచ్చాయి. అయినా ఆయన కుంగిపోలేదు. అన్నీ భరించాడు.. అదను చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించారు పవన్ కల్యాణ్.

పక్కా ప్రణాళికతో ముందుకు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారనే ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి కూడా అంతే కారణం. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కల్యాణ్.. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కల్యాణ్.. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి.. పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టుకట్టిన పవన్.. బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్‌షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ.. టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది.

తాను తగ్గి.. కూటమికి అండగా నిలిచి..
ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ.. సీట్ల కేటాయింపులో చిక్కులు వచ్చాయి. అప్పుడు కూడా పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి.. కూటమి నిలబడటానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. మొదట 23 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబట్టడంతో రెండు ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్.. చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు సీఎం పదవిని అడగాలంటూ హరిరామజోగయ్య లాంటి సీనియర్లు పదేపదే సూచించినా పవన్ కల్యాణ్ ఆ డిమాండ్ చేయలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరం అంటూ తాను తగ్గి కూటమికి అండగా నిలిచారు. ఆ రకంగా చారిత్రక విజయానికి కారణంగా నిలిచారు పవర్ స్టార్.

Also Read: హమ్మయ్య.. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపుపై స్పందించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే..

వ్యూహాం మార్చి.. బీజేపీతో జట్టు కట్టి..
2019 ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేనాని కామ్రేడ్లతో పాటు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కల్యాణ్ పూర్తిగా వ్యూహాం మార్చేశారు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. వారితో స్నేహంగా ఉంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యారు. వైసీపీపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పదే పదే ప్రకటించారు.

Also Read: ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు.. కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల కోసం పట్టు..!

ఓవైపు తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు బీజేపీ నుంచి అభ్యంతరాలు వ్యకమైనప్పటికీ పట్టు విడవకుండా ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు. ఓవైపు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పీడ్ పెంచిన పవన్..ఏపీ పాలిటిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. బీజేపీపై ఒత్తిడి పెంచుతూ ఫైనల్‌గా పొత్తును కుదుర్చడంలో సక్సెస్ అయ్యారు పవన్.

కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర
బీజేపీ కూడా జనసేన, తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు అంగీకరించడంతోనే ఈ కూటమికి ఈ విజయం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీతో జతకలిసేందుకు చాలాకాలం సాగదీసింది. ఒకవైపు ఎన్డీయేలోనే ఉన్న పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని చేసిన ప్రయత్నాలు, మరోవైపు ఏపీలో అధికార వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవని కేంద్ర నిఘావర్గాలు ఇచ్చిన రిపోర్ట్‌తోనే బీజేపీ పొత్తుకు ఒప్పుకున్నట్లు టాక్. చివరికి మూడు పార్టీలు కలిసే ఎన్నికల సమరంలో దిగి విజయతీరాలకు చేరాయి. కూటమిలో కీలకంగా ఉన్న పవన్.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కేబినెట్‌లో చేరే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని జనసేన అభిమానులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు