apsrtc tickets Booking on whatspp
Whatsapp Governance: దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మంత్రి నారా లోకేశ్ గత నెల30న ఈ సేవలను ప్రారంభించారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తుంది. ఇందుకోసం 95523 00009 నెంబర్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ సేవల ద్వారా బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ సేవల ద్వారా బస్ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు యాజమాన్యం సూచించింది. దూర ప్రాంత బస్సు సర్వీసులన్నింటిలో వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించారు.
టికెట్ బుకింగ్ ఇలా..
♦ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వాట్సాప్ సేవల ద్వారా బస్సు టికెట్ ను కూడా బుక్ చేసుకోవచ్చు.
♦ వాట్సాప్ ద్వారా బస్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తెచ్చింది.
♦ వాట్సప్ ద్వారా బస్సు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 95523 00009 నంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపాలి.
♦ ఆ తరువాత అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది.
♦ అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ లేదా రద్దు అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
♦ బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
♦ అందుబాటులోఉన్న సర్వీసులను చూపిస్తుంది.
♦ వాటిలో సీట్లు ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఆన్ లైన్ లేదా డిజిటల్ చెల్లింపులు చేయాలి.
♦ బుక్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నెంబర్ కు టికెట్ వస్తుంది.
♦ వాట్సాప్ లో వచ్చిన టికెట్ ను చూపించి బస్సులో ప్రయాణించవచ్చు.
వాట్సాప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఎపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి. ‘‘ప్రభుత్వం ప్రకటించిన వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలు వినతులు కూడా చేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్ నెంబర్ కు మెస్సేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చింది.. ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు.’’