గిరిజన ప్రాంతాలకు భారీగా నిధులు కేటాయింపు

  • Publish Date - June 16, 2020 / 09:17 AM IST

2020-21 బడ్జెట్‌లో గిరిజన అభివృద్ధికి జగన్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏపీలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలపై సీఎం వైఎస్‌ జగన్.. రాష్ట్ర బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా భారీగా నిధులు కేటాయించారు. ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  వివరాలను వెల్లడించారు.

వందల ఏళ్లుగా అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు సంక్షేమమే ధ్యేయంగా నిధులను కేటాయించారు. గిరిజనుల కష్టాలను చూసిన జగన్ సర్కార్.. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపే దిశగా అడుగులు వేస్తోంది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యంపై బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాల కోసం విశాఖపట్నం జిల్లా పాడేరులో వైఎస్సార్‌ వైద్య కళాశాలను మంజూరు చేసింది. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్‌పురం, శ్రీశైలంలో అదనంగా ఆరు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నిర్మించనుంది.

తగిన నిధులను కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించినట్టు తెలిపారు. ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుచ్చే దిశగా గిరిజన సంస్కృతికి, కళలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేయడానికి విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తోందన్నారు.