×
Ad

Investments Flow To AP: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. ఏయే కంపెనీలు, ఎన్ని వేల కోట్లు అంటే..

16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి.

Investments Flow To AP: ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో భారీగా ఇన్వెస్ట్ మెంట్స్ రానున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలో రూ.50 వేల కోట్లతో 3 గిగా వాట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయి.

బ్రూక్‌ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC 7వేల 500 కోట్ల రుణం అందించనుంది. ప్రైవేట్ ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతి పెద్ద ఫండింగ్ ఇదే. 1.4 గిగా వాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్‌ఫీల్డ్ 9వేల 910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 గిగా వాట్ల పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.9,910 కోట్ల వ్యయంతో తొలి దశ ప్లాంట్ ఏర్పాటు కానుంది. భారత్‌లో ఎవ్రెన్ 11 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనుంది. ఇందులో ఏపీలోనే 9 ప్రాజెక్టులను నిర్మించనుంది.

అటు రాష్ట్రంలో 20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు వారు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600 మెగా వాట్లు పెంచేందుకు.. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటునకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై ఎంవోయూ పూర్తైంది.

ఇక.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెప్పారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయన్నారు. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుందన్నారు. ఈ ఒప్పందాల వల్ల 9 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారని ఆయన వెల్లడించారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు.

16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు..
”నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ సమ్మిట్. ఈ సమ్మిట్ కు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఐఐ సమ్మిట్ జరుగుతోంది. 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ఏపీకి సమర్థ నాయకత్వం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం” అని మంత్రి లోకేశ్ అన్నారు.

Also Read: ఎవరినీ వదలను, ఫలితం అనుభవిస్తారు- సోషల్ మీడియాలో పోస్టులపై మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్..