AP Rains
AP Heavy Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు చేసిన పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏపీలో (AP Heavy Rains) వచ్చే పది రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. హెక్టార్‌కి 50వేలు..
తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఈనెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఇది ఈనెల 27వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి అదేరోజు ఒడిశా తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈనెల 23వ తేదీ నుంచి వచ్చేనెల (అక్టోబర్) 2వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6గంటల వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 97.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. తిరుపతిలో 77.7, చిత్తూరు జిల్లా కార్వేటినగర్ లో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు (శనివారం) ద్రోణి ప్రభావంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.