Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. హెక్టార్‌కి 50వేలు..
2 లక్షల 67 వేల మెట్రిక్ టన్నుల ఉల్లికిగాను ఇప్పటివరకు 13వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించారు.

Onion Farmers: ఏపీలో ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. వారికి శుభవార్త చెప్పారు. ఉల్లి పండించిన ప్రతీ రైతుకు హెక్టార్ కు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉల్లి రైతుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర అదనపు భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయదనే ఆందోళన రైతులకు అవసరం లేదని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఉల్లికి ధర తగ్గిందనే ఆందోళన ఇక రైతులకు అక్కర్లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాగే ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయదనే ఆందోళన కూడా రైతులకు అవసరం లేదన్నారు. రైతులెవరూ ఆందోళన చెందకుండా మార్కెట్ లో ధర వచ్చినప్పుడే మార్కెట్ లో అమ్ముకోవాలని సూచించారు.
సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో రావాల్సిన ఉల్లి ఆగస్టు నెలాఖరుకే వచ్చిందన్నారు. వర్షాల వల్ల ధర రాదేమో అనే ఆందోళన తో ఉల్లినంతా మార్కెట్ కు తెచ్చి.. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కేజీ రూ.12కు కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 13వేల మెట్రిక్ టన్నుల ఉల్లి కేజీ 12రూపాయలకు కొన్నా రైతు బజార్లలో కొనుగోళ్లు లేక బయటపారేసే పరిస్థితి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వాపోయారు.
2 లక్షల 67 వేల మెట్రిక్ టన్నుల ఉల్లికిగాను ఇప్పటివరకు 13వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వమూ గిట్టుబాటు ధర రాని పంటలను పట్టించుకోలేదన్నారు. మాటలు, ఉపన్యాసాలు కాకుండా రైతులకు ఇబ్బంది వస్తే పట్టించుకుని ఆదుకుంది కూటమి ప్రభుత్వమే అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరలు పతనమై కష్టాల్లో ఉన్న మిర్చి, కోకో, మామిడి, పొగాకు రైతులను ఆదుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. చాలా సందర్భాల్లో ఈ తరహా ధరలు పతనమైనా గత ప్రభుత్వం ఏ సందర్భంలోనూ ఆదుకున్నది లేదని ఆయన విమర్శించారు.