భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు..

ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారించారు.

Ex MLA Grandhi Srinivas : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గ్రంధి శ్రీనివాస్ నివాసాలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు అధికారులు. 5 రోజులుగా సాగిన ఐటీ సోదాలు.. ఇవాళ ముగిశాయి. ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరాతీసిన ఐటీ అధికారులు.. తనిఖీల్లో పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

భీమవరంలో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఏక కాలంలో 7 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. భీమవరం, నాగాయలంక, సింగరాయ కొండలో ఐటీ సోదాలు జరిగినట్లు సమాచారం. భీమవరం, నాగాయలంకలో ఐటీ సోదాలు పూర్తయ్యాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో ఐటీ అధికారులు 5 రోజుల పాటు ఎమ్మెల్యే గంధ్రి శ్రీనివాస్ ఇల్లు, ఆఫీసుల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు అధికారులు.

పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడం, పన్నులు చెల్లించలేదనే ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ దాడుల్లో గ్రంధి శ్రీనివాస్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి.. కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారించారు. గ్రంధి శ్రీనివాస్ ఆర్థిక లావాదేవీలపై కొన్ని రోజులుగా నిఘా ఉంచిన ఐటీ అధికారులు ఏక కాలంలో ఈ రైడ్స్ చేసినట్లు సమాచారం.

 

Also Read : నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు?