Glass Bridge: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. దేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి విశాఖలో ప్రారంభం.. దీని ప్రత్యేకతలు ఇవే.. పొడవు ఎంతంటే?
Kailasagiri Glass Bridge : పర్యటకులకు గుడ్‌న్యూస్. ఏపీలోని విశాఖపట్టణంలో దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది.
Glass Bridge
Kailasagiri Glass Bridge : పర్యటకులకు గుడ్‌న్యూస్. ఏపీలోని విశాఖపట్టణంలో దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. కైలాసగిరిపై నిర్మించిన ఈ గాజు వంతెనను వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ.7కోట్లతో నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని విశాఖపట్టణం ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..
♦ విశాఖపట్నం కైలాసగిరిపై నిర్మించిన గాజు వంతెన 50 మీటర్ల పొడవైనది.
♦ ఇప్పటివరకు కేరళలోని 40 మీటర్ల గాజు వంతెన పొడవైనదిగా ఉండేది. అయితే, కైలాసగిరి గాజు వంతెన దానిని అధిగమించింది.
♦ గాజు గ్లాసు బ్రిడ్జిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేశారు.
♦ ఈ బ్రిడ్జి నిర్మాణానికి 40ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజు వినియోగించారు.
♦ జర్మనీ నుంచి గాజు దిగుమతి చేసుకున్నారు.
♦ ఒకేసారి 500 టన్నుల బరువును తట్టుకోగల సామర్థ్యం ఈ గాజు గ్లాసు బ్రిడ్జికి ఉంది.
♦ ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ గ్లాస్ బ్రిడ్జి తట్టుకునేలా డిజైన్ చేశారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఇది తట్టుకోగలదు.
♦ ఒకేసారి 40 మంది పర్యాటకులు ఎక్కి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
♦ రాత్రివేళల్లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్తు కాంతులతో ఈ వంతెన మెరిసిపోతుంది.
♦ పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలుమార్లు పరిశీలించి, మార్పులు చేసిన తర్వాతే దీనిని ప్రారంభిస్తున్నారు.
♦ వాస్తవానికి ఈ బ్రిడ్జిపైన ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యం ఉంది. కానీ భద్రత దృష్ట్యా కేవలం 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు.
♦ ఈ బ్రిడ్జిపైకి ఎక్కి చూస్తే ఆ చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, దూరంగా సముద్రం కనిపిస్తుంది.
♦ ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే గాల్లో తేలియాడుతున్నట్లుగా.. అదేదో కొత్త లోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది.
♦ నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ గ్లాస్ బ్రిడ్జి సరికొత్త థ్రిల్ అందించనుంది.
