కక్షపూరితంగా డిస్మిస్ చేశారు: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

నా భార్య టీడీపీలో చేరారని, టీడీపీ వాళ్ళతో నేను టచ్ లో ఉన్నానని కారణాలు చూపి సస్పెండ్ చేశారు.

కక్షపూరితంగా డిస్మిస్ చేశారు: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

Indukuri Raghu Raju: చేయని తప్పుకు ఏపీ కౌన్సిల్ చైర్మన్ తనను ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్ చేశారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వాపోయారు. విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిల్ చైర్మన్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను శాసనమండలి నుంచి డిస్మిస్ చేశారని ఆరోపించారు.

”కౌంటింగ్ ముందు రోజు నాలుగో నోటీసు ఇచ్చి డిస్మిస్ చేశారు. షెడ్యూల్ 10 కింద డిస్మిస్ చేసినట్టు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద నేనేమీ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదు. నా భార్య టీడీపీలో చేరారని, టీడీపీ వాళ్ళతో నేను టచ్ లో ఉన్నానని కారణాలు చూపి సస్పెండ్ చేశారు. గతంలో ఇలాంటి కారణం చూపి ఎవరిని డిస్మిస్ చేసిన దాఖలాలు లేవు. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. అనారోగ్య కారణాలు వల్ల సమయం కోరాను కానీ అవకాశం ఇవ్వలేదు. రాజ్యాంగానికి తూట్లు పొడిచారు, నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డార”ని ఇందుకూరి రఘురాజు అన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్పడుతున్నారని శాసనమండలిలో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేయడంతో మార్చి 27న రఘురాజుకు కౌన్సిల్ చైర్మన్ తొలిసారిగా నోటీసు జారీ చేసింది. దీనికి ఏప్రిల్ 4న రఘురాజు వివరణ ఇచ్చారు. మే 23న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి నోటీసు పంపారు. అనారోగ్యం కారణంగా రఘురాజు హాజరుకాకపోవడంతో మే 31న మరో నోటీసు ఇచ్చారు.

Also Read: అదృష్టవంతులు..! ఎమ్మెల్యే టికెట్ కోసమే కష్టపడిన నేతలకు ఏకంగా మంత్రి పదవులు