ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బిటెక్ రవి విమర్శలు గుప్పించారు. పులివెందుల ప్రజలు ఉప ఎన్నిక కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికను స్వాగతిస్తున్నానని తెలిపారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీని ఓడించడమే తన జీవిత ఆశయమని అన్నారు. ఏ సభ్యుడైనా స్పీకర్ అనుమతి లేకుండా 90 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత తప్పదని అన్నారు. దీనికి రాజ్యాంగబద్ధమైన ఆర్టికల్ ఉందని, ఇలా నలుగురు సభ్యులు అనర్హతకు గురయ్యారని చెప్పారు.
కడపలో బీటెక్ రవి మాట్లాడుతూ.. వల్లభనేని వంశీతో ములాఖత్‌లో పాల్గొన్న జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పోలీసులను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో పులివెందులలో బాధితుల పరామర్శకు వస్తే అప్పట్లో వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని తెలిపారు.
ఇప్పటికీ ఆ కేసు వాయిదాలు జరుగుతున్నాయని చెప్పారు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేసు కొట్టించుకోలేక పోతున్నామని చెప్పారు. న్యాయవ్యవస్థ ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.
గతంలో పోలీసులను వాడుకొని తనను భౌతికంగా అడ్డు తొలగించాలని, తన ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి సామాజిక వర్గాల గురించి, కులం గురించి, అందం గురించి మాట్లాడడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు.