Gold: వామ్మో.. ఏందిరా నాయనా ఇది.. రూ.173 కోట్ల బంగారం చోరీ చేసి.. మన దేశంలో హాయిగా నిద్రపోతున్నాడా?

చండీగఢ్‌లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.

Gold: వామ్మో.. ఏందిరా నాయనా ఇది.. రూ.173 కోట్ల బంగారం చోరీ చేసి.. మన దేశంలో హాయిగా నిద్రపోతున్నాడా?

Updated On : February 19, 2025 / 4:32 PM IST

భారత్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కెనడాలోని టొరంటోలో జరిగిన పెద్ద బంగారు దోపిడీకి సంబంధించిన కేసులో దర్యాప్తు చేస్తోంది. గతంలో టొరంటో విమానాశ్రయం నుంచి సుమారు 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలను కొందరు చోరీ చేశారు. చోరీ చేసిన ఆ బంగారం, దాని ద్వారా వచ్చిన డబ్బు ఇండియాలో ఉందా? అన్న విషయాలను గుర్తించడానికి యత్నిస్తోంది.

టొరంటోలో దోపిడీలో పాల్గొన్న వ్యక్తుల్లో ఒకరు ప్రస్తుతం భారతదేశంలో ఉండవచ్చని భావించింది. ఈ కేసుకు, భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా? మరొక దేశంలో జరిగిన నేరపూరిత కేసును పరిష్కరించడానికి భారత్‌లో ఎలాంటి అధికారాలు ఉన్నాయన్న విషయం ఆసక్తి రేపుతోంది.

పూర్తి వివరాలు
కెనడాలో 2023 ఏప్రిల్ 17న పియర్సన్ అంతర్జాతీయ విమానంలో చోరీ జరిగింది. దాదాపు 400 కిలోల బంగారం, రూ.21 కోట్ల విలువైన కరెన్సీని కొందరు దుండగులు కొట్టేశారు. ఈ కేటుగాళ్లలో మాజీ ఎయిర్ కెనడా మేనేజర్ సిమ్రన్ ప్రీత్ పనేసర్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ చోరీ గురించి దర్యాప్తు జరుపుతున్న కెనడా పోలీసులకు అతడు మొదట పలు వివరాలు తెలిపాడు.

అనంతరం పోలీసులకు అతడిపై అనుమానం పెరగడంతో కెనడా నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అతడు కెనడాలోని ప్రాంప్డన్‌లో ఉండేవాడు. విచారణ జరుగుతున్న వేళ తనపై అనుమానాలు పెరగడంతో కెనడా నుంచి భారత్‌కు అతడు వచ్చి చండీగఢ్‌లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ కెనడాకు ఉద్యోగి పరంపాల్ సిద్ధూ కూడా ఈ చోరీలో పాల్గొన్నట్లు తేలింది. అతడు గతంలోనే అధికారుల ముందు లొంగిపోయాడు. ఈ కేసులో అధికారులు దాదాపు రూ.3 కోట్ల విలువజేసే కరెన్సీతో పాటు రూ.77 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని బ్రేస్‌లెట్లుగా మార్చినట్లు అనుమానిస్తున్నారు.

మన ఈడీ ఏం చేస్తోంది?
ఇప్పుడు ఈ బంగారం దోపిడీ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ప్రధాన నిందితుడు సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. ఈ బంగారంని స్థిరాస్తుల కొనుగోలులో పెట్టుబడి పెట్టారా లేదా బ్యాంకుల్లో అక్రమ నగదును డిపాజిట్ చేయడం వంటి చరాస్తులను కొనుగోలు చేశారా అనే దానిపై ఈడీ దర్యాప్తు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

‘పనేసర్’ చండీగఢ్‌లో దాక్కున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కెనడాకు చెందిన ఫెడరల్ దర్యాప్తు సంస్థతో పాటు, పంజాబ్ పోలీసులు కూడా అతని కోసం వెతుకుతున్నారు. దోపిడీ చేసిన సొమ్ము బంగారం లేదా దాని ద్వారా వచ్చిన ఆదాయం ఇండియాకు చేరిందా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉందని ఓ ఆఫీసర్ తెలిపారు.