ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఏ మూల నుంచి ఎలా వచ్చి ఎలా కాటేస్తుందో? తెలియకుండా కరోనా వచ్చేస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు చేయి దాటి పోతున్నాయి. ఈ క్రమంలో బాధితులకు సత్వరమే వైద్యమందించి, వారిని వైరస్ నుంచి విముక్తులను చేయడంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి సేవలు ఇప్పుడు అత్యవసరం.
ఈ మేరకు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డాక్టర్లే కాదు ప్రైవేటు డాక్టర్లు కూడా కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొని సేవలందించాల్సిగా వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ డాక్టర్లు ఉన్నారో అందరినీ గుర్తించి వాళ్లందరి సేవలు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
సేవలను డాక్టర్లనే కాదు.. నర్సులు.. పారా మెడికల్ సిబ్బంది, వాలంటీర్లు.. అసోసియేషన్‌ల సభ్యులు, యూత్‌క్లబ్‌లు అందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు ఆదేశాల్లో స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా సమయంలో సేవలు చెయ్యడానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సభ్యులను తీసుకోబోతున్నారు.
ఆయుష్ డాక్టర్లందరినీ తక్షణమే విధుల్లోకి రప్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లను, ఎన్‌సీసీ వలంటీర్లందరినీ సేవల కోసం వినియోగించనున్నారు. కోవిడ్ సేవల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రక్షణ కిట్‌లు ప్రభుత్వమే ఇస్తుంది.