Pawan Kalyan
అమరావతి రాజధాని – ఎస్సీ వర్గీకరణపై చాలా మంది మేధావులతో చర్చలు జరిపామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “మాలమాదిగ ఐక్యత గురించి కూడా చాలా మంది మేధావులు మాట్లాడారు. ఈ రెండు కులాలతో పాటు ఉపవర్గాలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయి” అని అన్నారు.
“రెల్లి, బేడబుడగ జంగాలు, దళితులకంటే వెనుకబడిన యానాదులు గురించి అధ్యయనం చేసిన వారితోనూ మాట్లాడాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఇంతవరకూ వచ్చింది మందకృష్ణ మాదిగతో అయినా.. దానిని ముందుకు తీసుకెళ్లింది సీఎం చంద్రబాబే. మందకృష్ణ మాదిగలకు ఆత్మగౌరవాన్ని తెచ్చారు. ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నా.
తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఏపీలో మాలలు ఎక్కువ. వివిధ రాష్ట్రాల్లో వివిధ ఉపకులాలు ఎక్కువ తక్కువలు ఉన్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న వర్గీకరణను సమర్థిస్తున్నా. 100 నుంచి 10 వేల మంది లోపు ఉన్న 46 ఉపకులాలు ఉన్నట్టు రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు.
సీఎం వర్గీకరణ అంశంపై నాలుగు నెలల్లో ఏక సభ్య కమిషన్ వేయటంతో పాటు మంత్రుల కమిటీని వేశారు. ఎస్సీల ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబాటు తనాలపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ బాగా అధ్యయనం చేసింది. మందకృష్ణ వర్గీకరణ పోరాటానికి ఆద్యుడు, చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్త- వర్గీకరణ రూపకర్త. ప్రధాని మోదీ వర్గీకరణ ప్రధాత అయ్యారు. బేడ, బుడగ జంగాలు, రెల్లి కులాలకు కూడా ఏదో విధంగా న్యాయం చేయాలి. ఈ నివేదికను జనసేన సంపూర్ణ మద్ధతు తెలియచేస్తోంది” అని చెప్పారు.