Janasena BJP Alliance : కమలంతో కటీఫ్..? బీజేపీతో పొత్తుపై పవన్ హాట్ కామెంట్స్
ఏపీలో బీజేపీ-జనసేనల పొత్తుకు బీటలు వారాయా? బీజేపీకి జనసేనాని పవన్ దూరం అవుతారా? పవన్ మాటల్లో ఆంతర్యం అదేనా? పవన్ మాటలు వింటే బీజేపీ-జనసేన మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తోంది.

Janasena BJP Alliance : ఏపీలో బీజేపీ-జనసేనల పొత్తుకు బీటలు వారాయా? బీజేపీకి జనసేనాని పవన్ దూరం అవుతారా? పవన్ మాటల్లో ఆంతర్యం అదేనా? పవన్ మాటలు వింటే బీజేపీ-జనసేన మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తోంది. బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పవన్.. ఓ నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోంది.
రోడ్ మ్యాప్ ఇంతవరకు ఇవ్వలేదన్న పవన్.. ఇంకెంత కాలం వెయిట్ చేయాలంటూ ప్రశ్నించారు. బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుందని బీజేపీని ఉద్దేశించి పరోక్ష సంకేతాలు పంపారు పవన్. వ్యూహం మార్చుకోవడం అంటే కమలానికి దూరం అవ్వటమేనా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీపై గౌరవం ఉందంటూనే ఊడిగం మాత్రం చేయబోము అని తేల్చి చెప్పారు పవన్.
”ఇంత పెద్ద జనసేన పార్టీ పెట్టుకుని, ప్రాణాలిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు ఉండి.. నువ్వు బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడుగుతావేంటి? నీకు సిగ్గు లేదా? అని ఉండవల్లి నన్న తిడుతూ ఉంటారు. కానీ, నేనేమీ బాధపడలేదు. పెద్ద వాళ్లు తిడితే ఆశీస్సులా తీసుకుంటా. బీజేపీ మీద నాకు గౌరవం ఉంది. అలా అని చెప్పి నా స్థాయిని నేను చంపుకోను.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
బీజేపీతో పొత్తు కుదిరినా బలంగా పని చేయలేకపోయామన్న బాధ ఉంది. ఆ విషయం నాకు తెలుసు, వాళ్లకూ తెలుసు. కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే నాకు కాలం గడిచిపోతోంది. పవన్ కల్యాణ్ పదవి కోసం అయితే ఇంత ఆరాటపడడు. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే, నా ప్రజలు రక్షించబడాలి.
నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. తప్పదు. అంతమాత్రాన ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ వ్యతిరేకంగా కాదు. గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ కలుస్తాం, ఎప్పుడూ ముందుకెళ్తాం. అలా అని చెప్పి ఊడిగం మాత్రం చేయం” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
రోడ్ మ్యాప్ కోసం ఇంకెంత కాలం వెయిట్ చేయాలి? వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుంది అంటూ బీజేపీతో పొత్తు అంశంపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన, బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. బీజేపీతో పవన్ కటీఫ్ చెప్పనున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి. పవన్ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.