కాకినాడ నుంచి బరిలోకి పవన్ కల్యాణ్? సొంతింటి కోసం సన్నాహాలు, వార్డుల వారీగా సమావేశాలు

కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారట.

Pawan Kalyan To Contest From Kakinada

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేస్తారా? అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు, జన సైనికులు. వార్డుల వారీగా సామాజికవర్గాలతో సమావేశాలు, కాకినాడలోనే సొంతిల్లు యోచన వంటివి.. పవన్ కాకినాడలోనే మకాం వేయడానికి సిద్ధపడినట్లుగా భావిస్తున్నారు పరిశీలకులు. ఇక కాకినాడపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడలో 50 వార్డులు ఉంటే ఏయే వార్డులో ఏయే సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే 28 వార్డుల పెద్దలతో మంతనాలు పూర్తి చేశారు పవన్ కల్యాణ్.

మరో రెండు మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ మళ్లీ కాకినాడ వెళ్లబోతున్నారు. కాకినాడ టూర్ లో భాగంగా 22 వార్డులపై సమీక్ష నిర్వహించబోతున్నారని సమాచారం. కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారట. కాకినాడ చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్

కాకినాడ కేంద్రంగా కొన్ని నెలలుగా జనసేన, వైసీపీ మధ్య రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు.

”నువ్వు ఎక్కడ నిలబడినా నీ బుద్ధి ప్రజలకు తెలుసు. నువ్వు ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు. ఎమ్మెల్యే అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అనే నీ కోరిక తీరాలంటే.. మంచి ప్రొడ్యూసర్ ను చూసుకో, లేదా నువ్వే ప్రొడ్యూస్ చేసుకో. సినిమా చేసుకో నీ కోరిక తీర్చుకో. అలా సంతోషపడు. అంతే తప్ప ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవడం, ముఖ్యమంత్రి కావడం నీ వల్ల కాదు” అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

”వైసీపీ గూండాలందరికీ కాకినాడ నడిబొడ్డు నుంచి చెబుతున్నా. మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి. నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతీ ఒక్కరినీ గుర్తు పెట్టి వీధివీధి తన్నితన్ని తీసుకెళ్తా. గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్కడికి చెమడాలు వలిపించేస్తాను” అంటూ రాజకీయ ప్రత్యర్థులపై చెలరేగిపోయారు జనసేనాని పవన్ కల్యాణ్.

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే పవన్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ నగరానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు కావాలి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వీటి గురించి పవన్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేయాలని అనుకోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. కాకినాడ నగరం.. ఇటు మత్స్యకారులు, అటు కాపు సామాజిక వర్గం ప్రభావిత ప్రాంతం. మత్స్యకారులు తర్వాత అదే స్థాయిలో ప్రభావితం చేసే కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి.

దానికి తోడు అటు రాజకీయంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ.. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం చంద్రశేఖర్.. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. వీర మహిళలపై దాడి చేసిన సందర్భం మొదలు.. అటు పవన్ ఇటు ద్వారంపూడి మధ్య యుద్ధం రావణకాష్టంలా సాగుతోంది. ద్వారంపూడిని ఓడిస్తాను అని పవన్ కల్యాణ్ సవాల్ కూడా విసిరారు. పవన్ ను ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ద్వారంపూడి కూడా అంతే ధీటుగా కామెంట్ చేశారు. మీపై పోటీ చేయడానికి నేను సిద్ధం, నాపై పోటీకి మీరు సిద్ధమా? అంటూ పవన్ కల్యాణ్ ను చాలెంజ్ చేశారు ద్వారంపూడి.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఈ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న పవన్ కల్యాణ్.. కాకినాడ నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. కాకినాడను తన సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు పవన్ కల్యాణ్ చర్యలు చేపట్టారని సమాచారం. ఇప్పటికే జనసేన నేతలు కాకినాడ చుట్టుపక్కల మూడు ఇళ్లు చూశారని, అందులో ఒక దాన్ని పవన్ కల్యాణ్ తన నివాసంగా కన్ ఫర్మ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కనుక కాకినాడ నుంచి పోటీ చేస్తే.. కాకినాడ జిల్లాలో ఉన్న పార్లమెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాకినాడ జిల్లా కాపు ప్రభావిత ప్రాంతం. దాంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపైనా పవన్ కల్యాణ్ ప్రభావం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.