పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి.

Pawan and Jagan
Andhrapradesh Politics : ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నాలు షురూ చేసింది. వ్యూహాత్మకంగా ఒక్కో అడుగు వేస్తోంది. తమ విజయానికి అవరోధాలుగా మారుతాయని భావిస్తున్న అన్ని అంశాలపై ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ ఇద్దరు నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు వేగవంతం చేసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. వీరిద్దరూ వైసీపీలో చేరితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను అధికశాతం తమ ఖాతాలో వేసుకోవచ్చని వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది.
పవన్ ఫ్యాక్టర్ తగ్గించేలా ..
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానిచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఈక్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు జనసేన, టీడీపీ అధిష్టానాలు దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు కాపు సామాజికవర్గం ఓటుబ్యాంకు పెద్దబలమని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూలేనంతగా పవన్ ను ఆయన సామాజిక వర్గం ఓన్ చేసుకుంటున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ నుంచి కాపు ఓటు బ్యాంకును దూరం చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధాలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది. వారిద్దరూ వైసీపీలో చేరితే పవన్ వైపు కాపు సామాజికవర్గం వెళ్లకుండా అడ్డకట్ట వేయవచ్చని వైసీపీ అదిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది.
కోరుకున్న నియోజకవర్గాల్లో టికెట్లు..!
ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధాలు వైసీపీలో చేరితే వారికి కోరుకున్న నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఇద్దరితో వైసీపీ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా మళ్లీ వైసీపీ గూటికి వస్తే విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తోదట. రాధాతోపాటు ఆయన సోదరికి కూడా గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఏదోఒక నియోజకవర్గంలో టికెట ఖరారు చేసే అవకాశం ఉందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరితే ఆయన పార్టీలో పెద్దపీట వేయడంతో పాటు ఆయన కుమారుడు చల్లారావు (గిరి)కు కాకినాడ లోక్ సభ స్థానాన్ని కేటాయించేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాకినాడ లోక్ సభ స్థానం కాదనుకుంటే కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏదోఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముద్రగడ కుమారుడిని బరిలోకి దింపేందుకు జగన్ సముఖత వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
వైసీపీ వ్యూహం ఫలిస్తుందా?
కాపు సామాజికవర్గాన్ని పూర్తి స్థాయిలో తమవైపు తిప్పకునేందుకు వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? ఒకవేళ వైసీపీ అధిష్టానం అనుకున్నట్లు జరిగితే టీడీపీ – జనసేన కూటమికి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు. ఏపీలో కొన్ని జిల్లాల్లో పార్టీల అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయి కాపు సామాజిక వర్గానికి ఉంది. ఈదఫా అధికశాతం కాపులు పవన్ కల్యాణ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాపు ఓట్లు గుండుగుత్తాగా పవన్ వైపు వెళ్లకుండా చెక్ పెట్టాలంటే వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభంలను వైసీపీలో చేర్చకోవటమేనని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. వంగవీటి కుటుంబానికి ఎప్పుడూ కాపుసామాజిక వర్గం అండగా నిలుస్తుంది. పద్మనాభం కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. అయితే, వీరిద్దరూ వైసీపీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేస్తారా? లేకుంటే.. బయటనుంచి వైసీపీకి మద్దతు ఇస్తారా..? వంగవీటి రంగా వైసీపీ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటారా? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది.