JC Prabhakar Reddy apologized to BJP leader and actress Madhavi Lata
JC Prabhakar Reddy – Madhavi Lata: బీజేపీ మహిళా నేత, నటి మాధవీ లత (Madhavi Lata) కు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడాల్సింది కాదు.. నా వయసు, ఆవేశం రిత్యా అలా మాట్లాడాను. ఆమెకు క్షమాపణలు ((Apologies) చెబుతున్నాను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై జేసీ పరోక్షంగా స్పందించారు. నన్ను వైసీపీలోకి వెళ్లు అని చెబుతున్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో చూసుకోవాలి. అధికారం ఉన్నప్పుడు కాదు.. లేనప్పుడు మాట్లాడు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Also Read: Gambhir: రోహిత్-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఏమన్నాడంటే?
న్యూఇయర్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నామీద నమ్మకంతో 14వేల మంది మహిళలు వచ్చారు. నేను ఫ్లెక్సీలు, పాంప్లెట్ల లీడర్ ను కాదు.. జనం గుండెల్లో ఉన్న నేతను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నా గురించి మాట్లాడిన వారంతా ప్లెక్సీ గాళ్లు. వీళ్లంతా అధికారం లేనప్పుడు ఎక్కడున్నారు అంటూ జేసీ ప్రశ్నించారు. నేను న్యూ ఇయర్ కు బొకేలు, ప్లెక్సీలు వద్దన్నా. అభివృద్ధి కోసం డబ్బు ఇవ్వమంటే ఎంతో ఇచ్చాను.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే నేను టీడీపీలో ఉంటున్నా. లేదంటే నాకు పార్టీ అవసరమే లేదు. నాకు తాడిపత్రి ప్రజలే పార్టీ. అన్నీ వాళ్లే. చంద్రబాబులో 0.5శాతమైన అభివృద్ధి చేయాలనుకుంటున్నానని జేపీ చెప్పారు. నాకు, నా కుమారుడికి గన్ మెన్లు అవసరం లేదని అన్నారు.
వివాదం ఏమిటంటే..?
న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రి మహిళలకోసం జేసీ పార్క్ లో ప్రత్యేకంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే, ఆ సెలెబ్రేషన్స్ కు మహిళలెవరూ వెళ్లొద్దంటూ బీజేపీ నాయకురాలు, నటి మాధవి లత పిలుపునిచ్చారు. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ నిర్వహించే ప్రాంతంలో గంజాయి బ్యాచ్ లు ఎక్కువగా ఉంటాయని, రాత్రివేళల్లో మహిళలకు ఎమైనా ప్రమాదం తలెత్తితే ఎవరి బాధ్యత అంటూ ఆమె ప్రశ్నించారు. మహిళలు జేసీ పార్క్ లో సెలబ్రేషన్స్ వెళ్లి ఇబ్బందుల్లో పడొద్దంటూ సూచించారు. ఇదే క్రమంలో జేసీకి సంబంధించిన ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్దమైంది. దీంతో జేసీ మాట్లాడుతూ.. మాధవీ లతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె ఒక వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తన బస్సు దగ్ధం వెనుక బీజేపీ వాళ్ల హస్తం ఉందంటూ జేసీ ఆరోపించారు.
జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ హెచ్చరించారు. మాధవి లత స్పందిస్తూ.. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, జేసీ వర్గీయుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అయితే, తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కు తగ్గారు. మాధవి లత పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. వయస్సు, ఆవేశం కారణంగా తాను ఆమెను అనకూడని మాటలు మాట్లాడటం జరిగిందని, అందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని జేసీ పేర్కొన్నారు.