JC Prabhakar Reddy
JC Prabhakar Reddy: వయసుతో సంబంధం లేదు. ఎవరి మాటలనూ అస్సలే పట్టించుకోరు. నాదే పైచేయి అంటే నాదే పైచేయి అనే మనస్థత్వం ఆ ఇద్దరిది. ఒకప్పటి ఫ్యాక్షన్ ఇలాకాలో.. ఫ్యాక్షన్ లీడర్ల వారసులుగా పాలిటిక్స్‌లో ఉన్న ఆ నేతలు.. ప్రతిరోజు పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నారు.
ఒకరి మీద ఒకరు సెటైర్లు..అంతకుమించి సవాళ్లు ప్రతిసవాళ్లతో హీటెక్కిస్తున్నారు. ఏ మాత్రం సందు దొరికినా తనదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకునేలా ప్రతీ అంశాన్ని తమకు అడ్వాంటేజ్‌గా మల్చుకునే గేమ్ ఆడుతున్నారు. ఎన్నికలు అయిపోనప్పటి నుంచి తాడిపత్రి పంచాయితీ లైమ్‌లైట్‌లో ఉంటూనే వస్తోంది. ఇప్పటికే పలుసార్లు కోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ నెల 6న పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చేందుకు పోలీసులు అనుమతించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 650 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. అయితే ఆ మర్నాడే పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేశారు. 10వ తేదీన సీఎం పర్యటన ఉన్నందున అంతవరకు భద్రత కల్పించలేమని, 10వ తేదీ తర్వాత తాడిపత్రి రావాలని నోటీసులిచ్చారు. దీనిప్రకారం కేతిరెడ్డి తాడిపత్రి వీడి వెళ్లిపోగా, రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయనను మళ్లీ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదం అయింది.
ఈ పరిస్థితుల్లో జేసీ కొత్త దుమారానికి తెరలేపారు. సుప్రీం ఆర్డర్స్ ప్రకారం డబ్బు చెల్లించకుండానే మాజీ ఎమ్మెల్యేకు బందోబస్తు కల్పించడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాదితో దరఖాస్తు చేయించిన జేసీ..వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పోలీసు భద్రత కోసం డబ్బు చెల్లిస్తానని సుప్రీంకోర్టుకు చెప్పిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ మాట తప్పారని జేసీ మళ్లీ కోర్టుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. కోర్టు ద్వారా కేతిరెడ్డికి ఝలక్ ఇచ్చేందుకు ఎత్తులు వేస్తున్నారట జేసీ ప్రభాకర్‌రెడ్డి.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం నడుస్తోంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి టౌన్ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలనా రూపంలో ఎలాంటి డబ్బులు కట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కేతిరెడ్డికి బందోబస్తును కల్పిస్తూ..అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జేసీ ఆరోపించారు.
అంతేకాదు పెద్దారెడ్డికి బందోబస్తు కావాలనుకుంటే తగిన నగదు కట్టించుకొని బందోబస్తు ఇవ్వాలని లేకుంటే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసినప్పుడు..పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పారట పెద్దారెడ్డి. ఆ మాట ప్రకారం భద్రతకు అయిన ఖర్చు చెల్లించాలని పోలీసులు ఇప్పడికే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సంప్రదించారట.
Also Read: కవితను కలవడానికి జంకుతున్న బీఆర్ఎస్ నేతలు..! ఎందుకంటే?
ఫలాన అమౌంట్ అయిందని వివరాలు చూపించగా..భద్రతకు అయిన ఖర్చును చెల్లించేందుకు పెద్దారెడ్డి ఒప్పుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం జేసీ ప్రభాకర్‌రెడ్డి చెవిన పడి..ఆ అంశాన్ని అస్త్రంగా మల్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఇప్పటికే ఆర్టీఏ ద్వారా సమాచారం కోరగా..పోలీసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారట జేసీ. పట్టుబట్టి పెద్దారెడ్డిని ఇన్నాళ్లు తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకోగలిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తుతో కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చారు. న్యాయపరంగా ఆ విషయంలో ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో అదే సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌ను అస్త్రంగా మల్చుకుని పెద్దారెడ్డి మీద అప్పర్ హ్యాండ్ సాధించే ఎత్తుల్లో బిజీగా ఉన్నారట జేసీ. రెగ్యులర్‌గా 650 మంది బందోబస్తుకు అయ్యే ఖర్చు భరిస్తే తడిసిమోపెడు అవడం ఖాయం. అందుకు పెద్దారెడ్డి ఒప్పుకోకపోవచ్చు. అలాంటప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. తను పట్టు పట్టినట్లు భద్రత లేకపోతే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేరనే అంచనాతో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారట జేసీ ప్రభాకర్‌రెడ్డి.