కవితను కలవడానికి జంకుతున్న బీఆర్ఎస్ నేతలు..! ఎందుకంటే?

కవిత నివాసానికి అలా వెళ్లాడో లేదో.. ఇలా మీడియాలో సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారని, త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన జాగృతి తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది.

కవితను కలవడానికి జంకుతున్న బీఆర్ఎస్ నేతలు..! ఎందుకంటే?

MLC Kavitha

Updated On : September 16, 2025 / 9:17 PM IST

K Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది. తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్..తర్వాత పరిణామాలతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఇక సొంతంగా రాజకీయం చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆమె జాగృతి పేరుతో యాక్టివిటీని స్పీడప్ చేసేందుకు ప్లాన్చేసుకుంటున్నారు.

త్వరలోనే తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చి..వచ్చే ఎన్నికల నాటికి గ్రౌండ్లోకి దిగాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నేతలను, తెలంగాణ ఉద్యమంలో పని చేసిన పరువురు ప్రముఖులను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నారట కవిత. అయితే కవిత ఆహ్వానానికి పెద్దగా స్పందన రావడం లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కవితను ఎవరు ఏ పనిమీద కలిసినా వాళ్లు తెలంగాణ జాగృతిలో చేరిపోయేందుకే కవితను కలిశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏదైనా కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికైనా..లేదా ఏదో అంశం మీద చర్చించడానికి అయినా సరే కవితను కలిస్తే చాలు.. వాళ్లు జాగృతిలో చేరిపోతున్నారనో..లేదంటే త్వరలోనే చేరబోతున్నారనో టాక్ బయలుదెరుతోంది. (K Kavitha)

విష్ణువర్ధన్ రెడ్డి విషయమే ఇందుకు నిదర్శనం

తాజాగా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి విషయమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కవితను ఆహ్వానించేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. శరన్నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కవిత నివాసానికి అలా వెళ్లాడో లేదో..ఇలా మీడియాలో సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారని, త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన జాగృతి తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది.

Also Read: తెలంగాణలో లోకల్ పోరుకు.. బిహార్ ఫోబియా.. ఏమైందంటే?

ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అంటూ ఓ సెక్షన్ వార్తను స్ప్రెడ్ చేసేసింది. తాను కవిత నివాసం నుంచి బయటకు రాగానే ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి నిజంగానే షాక్ తిన్నారట. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి..తాను బీఆర్ఎస్ను వదిలే ప్రసక్తే లేదని, కేటీఆర్ వెంటే తన ప్రయాణం అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

విష్ణువర్ధన్ రెడ్డికే కాదు.. బీఆర్ఎస్ నాయకులు, ఇతర ముఖ్యుల విషయంలోనూ ఇలానే జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరు ఏ పనిమీద కవితను కలవడానికి వెళ్లినా..వెంటనే వాళ్లు తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారనే ప్రచారం జరగడం నేతలకు కోపం తెప్పిస్తోందట. ఈ ప్రచారం చేస్తున్నదెవరు.? కవిత టీమే లీకులిచ్చి మరీ వార్తలు వచ్చేలా చేస్తోందా.?

లేదా ఇంకెవరైనా బీఆర్ ఎస్ పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారట లీడర్లు. కవితను అలా కలిశారో లేదో ఇలా.. మీడియాకు, సోషల్ మీడియాలో న్యూస్ రావడం చూసి షాక్ అవుతున్నారట. దీంతో ఇప్పుడు కవిత ఇంటికి కాదు..ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికే జంకుతున్నారట బీఆర్ఎస్ నేతలు. కవిత అంశం ఎక్కడైనా చర్చకు వచ్చినా సైలెంట్‌గా ఉండిపోతున్నారే తప్ప ఎందుకొచ్చిన గొడవని ఎవ్వరు పెద్దగా స్పందించడం లేదట.