తెలంగాణలో లోకల్ పోరుకు.. బిహార్ ఫోబియా.. ఏమైందంటే?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

తెలంగాణలో లోకల్ పోరుకు.. బిహార్ ఫోబియా.. ఏమైందంటే?

CM Revanth Reddy

Updated On : September 16, 2025 / 8:58 PM IST

Telangana panchayat elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పటికప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. డైలీ సిరియల్‌గా..రోజుకో ట్విస్ట్‌తో రేపోమాపో ఎన్నికలు అన్నట్లుగా నెట్టుకొస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల నగారా మోగడమే ఆలస్యం అన్నట్లు సాగదీస్తూ వస్తోంది.

ఇప్పుడు బిహార్ ఎన్నికల వేడి తెలంగాణకు తాకుతోంది. దీంతో రేవంత్ సర్కార్..లోకల్ పోరుకు వెళ్లేందుకు జంకుతుందట. కారణం బీసీ కోటా. ఈ అంశం ఇప్పుడు నేషనల్ ఎజెండా అయిపోయింది. తెలంగాణలో ఆల్రెడీ బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేశామని చెప్పుకునేందుకు రెడీ అయింది కాంగ్రెస్. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది. రాష్ట్రప్రభుత్వం పంపించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంది. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఆగిపోయింది.

ఇక బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ జీవో జారీ చేసేందుకు రెడీ అవుతోందన్న లీకులు బయటికి వచ్చాయి. కానీ స్థానిక పోరు అంటేనే కాంగ్రెస్ వణికిపోతుందట. ఓవైపు యూరియా కష్టాల..ఇంకోవైపు వానలు, వరదలు, సర్కార్ హామీలు..అన్నీ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. ఇవన్నీ ఇంటర్నల్ విషయాలే అయినా..నేషనల్ ఇష్యూగా కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అంశం బీసీ రిజర్వేషన్లు.

Also Read: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్‌ విడుదల.. ఫుల్‌ డీటెయిల్స్‌ చూసేయండి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఏ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో.. అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్ ఇద్దరి దగ్గర పెండింగ్ లిస్ట్‌లో ఉండిపోయింది బీసీ రిజర్వేషన్ల అంశం. ఇది ఇలా ఉంటే.. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ డెడ్ లైన్ పెట్టింది. కానీ అంతలోపే ఎన్నికలకు వెళ్దామంటే..బిహార్ ఎన్నికలు కాంగ్రెస్‌కు గుబులు పుట్టిస్తున్నాయట.

బీసీ రిజర్వేషన్లు ఇద్దామంటే అడ్డంకులు

రాష్ట్రపతి దగ్గర బిల్లు, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ పాస్ చేసిన బిల్లు కూడా పెండింగ్‌లోనే ఉండిపోయింది. పోనీ జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇద్దామంటే కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. అలా అని బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటే బిహార్ ఎన్నికలు కాంగ్రెస్‌కు సవాల్ మారాయి. అక్కడ కూడా…బీసీలకు 42 శాతం ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్న ఒత్తిడి కాంగ్రెస్‌పై వస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘడ్‌బంధన్..RJD-కాంగ్రెస్-లెఫ్ట్ అలయన్స్‌కు బీసీ రిజర్వేషన్లు సవాల్‌గా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే..బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్ అంశంపై..తెలంగాణ మోడల్‌గా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది. ఈ అంశంపై బీసీలను అట్రాక్ట్ చేయడంలో కాంగ్రెస్ కొంత సక్సెస్ అయ్యింది. దీంతో మోదీ సర్కార్ కూడా వచ్చే జనగణనలో..కులగణన చేస్తామంటూ ప్రకటించింది. ఈ సమయంలో ఇక్కడ పార్టీ ద్వారా బీసీలకు టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే..బిహార్‌లో కూడా..ఇదే అంశం..కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది.

ఇది సొంత కూటమిలో కూడా..బీసీ నేతల అసంతృప్తి దారి తీయొచ్చు. దీంతో బిహార్ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిందట కాంగ్రెస్ పార్టీ. అందుకోసం హైకోర్టును మూడు నెలల గడువు కోరేందుకు ఇప్పటికే అన్ని అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకుందట. పైకి బీసీ రిజర్వేషన్ల ఇద్దామంటే అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నా..బిహార్ ఎన్నికలే కాంగ్రెస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. మరి బిహార్ ఎలక్షన్స్ తర్వాతైనా కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ పోల్స్ నిర్వహిస్తుందో ఇంకా టైమ్ తీసుకుంటుందో వేచి చూడాలి మరి.