Kethireddy Peddareddy, JC Prabhakar Reddy (Image Credit To Original Source)
Tadipatri: ఎవ్వరికీ భయపడే ముచ్చటే లేదు. ఎట్లైతే గట్లాయె. ఏడికైతే గాడికాయే. బట్ వన్ కండీషన్. నీ ఫ్యామిలీ..నా ఫ్యామిలీనే తేల్చుకుందాం..అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన పెద్దారెడ్డి..డేట్ టైం ఫిక్స్ చెయ్ అంటూ..బాలయ్య సినిమాలోని పాపులర్ మాస్ డైలాగ్‌ను రిపీట్ చేశారు.
దీంతో తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటుంది. అటు జేసీ ఫ్యామిలీ ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి హైవోల్టేజ్ పొలిటికల్ ఫైట్‌కు దిగుతున్నారు. ఇదంతా రాయలసీమ పౌరుషం మీద డిబేట్ అంటున్నారు. నేను రెడీ అంటే నేను రెడీ అంటూ..మీసాలు మెలేస్తున్నారు. లేటెస్ట్‌గా రాయలసీమ పౌరుషంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. అంతే కాదు ఎక్కడైనా ఎప్పుడైనా తాను చర్చకు రెడీ అంటూ బింగ్ సౌండ్ చేశారు పెద్దారెడ్డి.
Also Read: భార్యపై అనుమానం.. ప్లాన్ వేసి పట్టుకున్న భర్త.. ఆమెను చంపేసి పోలీస్ స్టేషన్‌కు ఏడుస్తూ వెళ్లి..
తాడిపత్రిని గత మూడు దశాబ్దాలుగా జేసీ ఫ్యామిలీ పాలిస్తే..తాను ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని..రెండు పాలనలపై చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ చేస్తున్నారు కేతిరెడ్డి. డేట్ టైం మీరే ఫిక్స్ చేయండి అని జేసీ ప్రభాకర్ రెడ్డికే చాన్స్ ఇచ్చారు. అంతేకాదు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తాడిపత్రిలో అయినా లేక రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా తాను చర్చకు రెడీగా ఉన్నాను అని ప్రతి సవాల్ చేశారు పెద్దారెడ్డి.
స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు: పెద్దారెడ్డి
జేసీ ఫ్యామిలీ పాలనలో మాజీ ఎమ్మెల్యేగా తనకే స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదని పెద్దారెడ్డి అంటున్నారు. తాను నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అలాంటి జేసీ ప్రభాకర్‌రెడ్డి రాయలసీమ పౌరుషం అంటూ తనకు సవాల్ విసరడం మీద తాను పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నానని..బహిరంగ చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమే అని కేతిరెడ్డి ప్రకటించారు.
అయితే ఓపెన్ డిబేట్‌కు ఓ కండీషన్ పెట్టారు పెద్దారెడ్డి. బహిరంగ చర్చకు జేసీ కుటుంబం, తన కుటుంబం మాత్రమే హాజరు కావాలని పెద్దారెడ్డి షరతు పెట్టారు. రెండు కుటుంబాల సమక్షంలోనే ఎవరి పాలన ఎలా ఉందనేది తేల్చుకుందామని అంటున్నారు. తాను ఎవరికీ దేనికీ భయపడేవాడిని కానని అంటున్న పెద్దారెడ్డి..దేఖ్ లేంగే అంటూ సవాల్ విసిరారు.
చాలా సెన్సిటివ్ ఏరియాగా తాడిపత్రి!
గత కొన్ని రోజులుగా తాడిపత్రి చాలా సెన్సిటివ్ ఏరియాగా మారిపోయింది. ఎన్నికల రిజల్ట్ తర్వాత..అక్కడ రాజకీయ వేడి ఇంకా రాజుకుంది. ఆ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం..మరింత రచ్చకు దారితీసింది. ఈ క్రమంలోనే కోర్టుకెళ్లి ఆర్డర్స్ తెచ్చుకుని పోలీస్ బలగాల మధ్య పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడం ఇంకా హాట్ టాపిక్ అయింది.
ఇక అప్పటి నుంచి జేసీ Vs పెద్దారెడ్డి అన్నట్లుగా..సినిమాలో క్లైమాక్స్ రేంజ్‌లో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడంతో తాడిపత్రి ఫైట్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటుంది. పెద్దారెడ్డి కామెంట్స్‌పై జేసీ ఎలా రియాక్ట్ అవుతారో.? బిగ్ డిబేట్‌కు సిద్ధపడుతారో.? లేక డైలాగ్‌వార్‌కే పరిమితం అవుతారో చూడాలి మరి.