భార్యపై అనుమానం.. ప్లాన్ వేసి పట్టుకున్న భర్త.. ఆమెను చంపేసి పోలీస్ స్టేషన్‌కు ఏడుస్తూ వెళ్లి..
తనను చంపినా సరే తాను ఆ ఇద్దరు యువకులతోనే ఉంటానని శ్వేత చెప్పింది. దీంతో ఆమెను గొంతునులిమి చంపిన భర్త.. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు.
Kanpur Couple (Image Credit To Original Source)
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన
- ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు
- భార్య అకౌంట్‌లో డబ్బులు పడుతుండడంతో అనుమానం
Kanpur Case: ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌కు ఏడుస్తూ వెళ్లి.. “నా భార్యను గొంతునులిమి చంపేశాను. ఆమె మృతదేహం ఇంట్లోనే ఉంది. దుప్పట్లో చుట్టేశాను సర్” అని ఇన్‌స్పెక్టర్‌కు చెప్పాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయే ముందు నిందితుడు దాదాపు 4 గంటలపాటు కాన్పూర్‌లో తిరిగాడు.
దర్యాప్తులో పోలీసులకు నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా మోహన్‌పూర్ గ్రామానికి చెందిన సచిన్ (22), శ్వేత ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి నివసించారు. అక్కడే ఓ ఫ్యాక్టరీలో సచిన్ పనిచేసేవాడు.
ఒక నెల రోజుల తర్వాత తన భార్యతో కలిసి అతడు కాన్పూర్‌కు వచ్చేసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆ నగరంలో సచిన్ ఆటోరిక్షా నడిపేవాడు. ఇంతలో శ్వేత ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం వచ్చింది. శ్వేత బ్యాంకు ఖాతాలోకి పదే పదే డబ్బులు ఎలా వస్తున్నాయని ఆమెను అడిగాడు. తన ఖాతాలో తన బామ్మ డబ్బులు వేస్తోందని శ్వేత అతడికి చెప్పింది.
అదే సమయంలో తమ ఇంటి ఎదురుగా నివసిస్తున్న విద్యార్థులపై అతడికి అనుమానం పెరిగింది. తన అనుమానం సరైనదేనా? అని ఆలోచించాడు. సచిన్ ఓ ప్లాన్ వేసుకుని, తన భార్య శ్వేతకు ఫోన్ చేసి ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నానని.. రాత్రికి ఇంటికి రానని చెప్పాడు. అయితే, రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో రూమ్ తెరిచి ఉంది.
అందులో అతడి భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారందరితో సచిన్ గొడవ పెట్టుకున్నాడు. వారు గొడవ ఆపకపోవడంతో పొరుగింటివారు 112కి కాల్ చేశారు. పోలీసులు వచ్చి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంటికి వచ్చిన తర్వాత శ్వేత, సచిన్ మళ్లీ గొడవపడ్డారు. దీంతో సచిన్‌ను శ్వేత బెదిరించే ప్రయత్నం చేసింది.
తనను చంపినా సరే తాను ఆ ఇద్దరు యువకులతోనే ఉంటానని చెప్పింది. దీంతో ఆమెను సచిన్ గొంతునులిమి చంపి, మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు. సచిన్ దాదాపు 4 గంటల పాటు కాన్పూర్‌లో తిరిగాడు. మొదట పారిపోదామని అనుకున్నాడు. చివరకు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.
