చీరాలలో ఒకే ఒరలో రెండు కత్తుల పోరు… కరణం బలరాం, ఆమంచి మధ్య రచ్చకెక్కిన ఆధిపత్య పోరు.. వైసీపీకి ప్లస్సా? మైనస్సా?

  • Publish Date - November 2, 2020 / 03:10 PM IST

karanam balaram vs amanchi krishna mohan: చీరాలలో ఒకే ఒరలో రెండు కత్తుల మధ్య పోరు జరుగుతోంది. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఇద్దరు బలమైన నేతల మధ్య ఆధిపత్య పోరు, విబేధాలు.. వైసీపీకి బలమా? బలహీనతా?

చీరాల రోడ్లపై మినీ యుద్ధం, భీకర ఘర్షణకు కారణమేంటి?
అక్టోబర్ 31 రాత్రి చీరాల దద్దరిల్లిపోయింది. ఇద్దరు లీడర్ల కేడర్ మధ్య.. దిమ్మతిరిగే వార్ నడిచింది. మా లీడర్ జిందాబాద్ అంటే.. మా లీడర్ జిందాబాద్ అంటూ.. పోటీ పడి మరీ గొడవపడ్డారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చీరాల రోడ్లపై ఓ మినీ యుద్ధమే జరిగింది. ఈ భీకర ఘర్షణకు అసలేంటి రీజన్? ఆమంచి కృష్ణమోహన్.. కరణం బలరాం.. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఇద్దరిదీ ఒకే పార్టీ.. ఒకే జెండా.. బలమైన కేడర్‌తో.. పటిష్టంగా ఉన్న ఇద్దరు లీడర్లు.. ఆమంచి, కరణం మధ్య పీక్‌కు చేరిన ఆధిపత్య పోరు.. నువ్వా-నేనా అన్న రీతిలో చీరాలలో పరిస్థితులు.

కరణం చీరాలలో అడుగుపెట్టినప్పటి నుంచి గొడవలు:
ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాల్లేవ్.. పరస్పర విమర్శల్లేవ్. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇంకా ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఎప్పుడైతే కరణం బలరాం అద్దంకిని వీడి.. చీరాలలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచే మొదలైంది ఈ పోరు. అదిప్పుడు.. తీవ్రంగా మారి ఘర్షణలకు దారితీస్తోంది. నెత్తురు చిందేలా చేస్తోంది.


రణరంగంగా మారుతున్న చీరాల:
ఆమంచి, కరణం మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో.. స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయ్. ఇది చూసి.. జనం బెంబేలెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. వర్గపోరుతో రణరంగంగా మారుతోంది. రెండు వర్గాలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌ మారింది. ప్రకాశం జిల్లాలో.. ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే నియోజకవర్గం చీరాల. ఎన్నికలప్పుడే కాదు.. రాజకీయంగానూ చీరాల ఎప్పుడూ కాకమీదుంటుంది. ఆమంచి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ నియోజకవర్గంపై ఆ ముద్ర పడిపోయింది. ఇప్పుడు.. ఇక్కడికి కరణం బలరాం ఎంటరయ్యారు. దీంతో.. పరిస్థితులన్నీ మారిపోయాయ్.

ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన:
ఈ ఇద్దరు నాయకులు సమఉజ్జీలు కావడం, జనంలో మాస్ లీడర్లన్న పేరు, బలమైన కేడర్ కలిగి ఉండటంతో.. ఎవ్వరూ తగ్గే పరిస్థితి కనిపించదు చీరాలలో. అందుకే.. ఈ ఇద్దరు లీడర్లు స్థానికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. టెంపరేచర్ పెరిగిపోతోంది. టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన కలుగుతోంది.

2019లో ఈ ఇద్దరు నాయకులు.. ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. ఆమంచిపై.. కరణం బలరాం గెలిచారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో.. వైసీపీలో చేరారు కరణం బలరాం. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది.