Kashibugga Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబాల ఇంటికి స్వయంగా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో 2లక్షల రూపాయల సాయం అందుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన రామ్మోహన్ నాయుడు.. ధైర్యంగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9మంది భక్తులు మరణించారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం రోజున వైష్ణవ ఆరాధన కోసం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంచనాలకు మించి భక్తులు తరలిరావడం, ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో తోపులాట జరిగింది. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పలువురు భక్తులు కిందపడిపోయారు. వారి పైనుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఆలయానికి ప్రతి రోజూ 3వేల నుంచి 4వేల మంది వరకు భక్తులు వచ్చేవారు. శనివారం రోజున మాత్రం అంచనాలకు మించి ఏకంగా 20వేల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. రెయిలింగ్ విరిగిపడటంతో 9 మంది చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. మృతుల్లో 8మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
శనివారం సాయంత్రం ఘటనా స్థలాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు లోకేశ్. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. బాధితు కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: కాశిబుగ్గ గుడి కట్టించింది ఈయనే.. తొక్కిసలాటపై ఏమంటున్నాడో చూడండి..