Kashibugga Temple Stampede: కాశిబుగ్గ గుడి కట్టించింది ఈయనే.. తొక్కిసలాటపై ఏమంటున్నాడో చూడండి..

గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్‌కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.

Kashibugga Temple Stampede: కాశిబుగ్గ గుడి కట్టించింది ఈయనే.. తొక్కిసలాటపై ఏమంటున్నాడో చూడండి..

Updated On : November 1, 2025 / 6:39 PM IST

Kashibugga Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9మంది భక్తులు మరణించడం తీవ్ర విషాదం నింపింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో వైష్ణవ ఆరాధన కోసం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే ఈ దుర్ఘటనకు దారితీసింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడం, ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో తోపులాట జరిగింది. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పలువురు భక్తులు కిందపడిపోయారు. వారి పైనుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.

తొక్కిసలాట ఘటనపై ఆలయ యజమాని 95ఏళ్ల హరిముకుంద్ పాండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని అస్సలు ఊహించలేదన్నారు. భక్తులు విపరీతంగా వచ్చారని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇంతమంది రాలేదని ఆయన తెలిపారు. కాగా గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్‌కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల 50 ఎకరాల స్థలంలో.. ఓ 10 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారాయన.

”రోజూ భక్తులు వస్తుంటారు. దర్శనం చేసుకుని వెళ్లిపోతారు. ఇవాళ కూడా అలాగే జరుగుతుందని అనుకున్నా. ఒక్కసారిగా జనం భారీగా వచ్చేశారు. గేట్లు తోసుకుని వెళ్లిపోయారు. ప్రతిరోజు 3వేల నుంచి 4వేల మంది భక్తులు ఆలయానికి వస్తారు. హాయిగా దర్శనం చేసుకుంటారు. ఎవరూ ఏమీ మాట్లాడరు. అంతా లైన్ లో వెళ్తారు. ప్రసాదం తీసుకుంటారు, తింటారు, వెళ్లిపోతారు. ఇవాళ అలా జరగలేదు. ఒకేసారి జనం భారీగా వచ్చేశారు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. రోజూ 4వేల మంది భక్తులు వస్తారు. వారందరిని నేను ఒక్కడినే మెయింటేన్ చేశాను. అందరూ జాగ్రత్తగా వెళ్లండి అని చెప్పేవాడిని. అలానే వెళ్లే వారు, దర్శనం చేసుకుని వెళ్లిపోయేవారు. ఇవాళ భారీ సంఖ్యలో జనం వచ్చేశారు. పోలీసులు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఒకేసారి జనం వచ్చేశారు” అని హరి ముకుంద్ తెలిపారు.

ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద్ 12ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అక్కడ రద్దీ కారణంగా భక్తులు తోసుకుంటూ వెళ్లడం.. సిబ్బంది కూడా పదండి.. పదండి అంటూ భక్తులను వెనుక నుంచి తరుముతున్నట్టుగా చేయడంతో స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగలేదు. దీంతో ఆయన మనస్తాపం చెందారు. తానే సొంతంగా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒక గుడి కట్టించి స్వామి దర్శనం రోజూ చేసుకోవాలని అనుకున్నారు. అలా తనుకున్న స్థలంలో 10 ఎకరాల్లో సొంత డబ్బుతో (సుమారు రూ.10 కోట్లు) వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు హరిముకుంద్.

Also Read: కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన.. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, 12ఏళ్ల బాలుడు.. ప్రమాదం ఇలా జరిగింది.. మృతులు వీరే