AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 9 అంశాలు అజెండాగా ఈ సమావేశం జరిగింది. అమరావతిలో రెండో దశ భూసేకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అమరావతి రెండో దశలో 44వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకొచ్చిన జీవోకు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్.
ఏపీ సెక్రటేరియట్ లో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది. 9 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. పలు రాజకీయ అంశాలు, రాష్ట్రంలో తాజా పరిణామాలు, ఏడాది పాలన, అందులోని లోటుపాట్లపై చర్చించారు.
రాజధాని అమరావతికి సంబంధించి పలు పనులకు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. జీఎల్డీ టవర్ టెండర్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హెచ్ఓడీకి నాలుగు టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రెండో దశలో అమరావతిలో 44వేల ఎకరాల భూమిని సేకరించే అంశంపై చర్చ జరిగింది. ఇందులో 5వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Also Read: నేరస్తులకు అండగా నిలవడం ఏంటి? రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న సీఎం చంద్రబాబు
2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై డిస్కస్ చేశారు. పలు సంస్థలకు భూకేటాయింపులపై క్యాబినెట్ లో చర్చించారు. తల్లికి వందనం స్కీమ్ అమలుపైనా క్యాబినెట్ లో చర్చించారు. కూటమి సర్కార్ ఏడాది పాలనపైనా చర్చించారు. ఇంకా ఎన్ని స్కీమ్ లు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశంపైనా చర్చ జరిగింది.