Nara Lokesh
కడప మహానాడులో పార్టీ కీలక నిర్ణయం తీసుకోబోతుందా? అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న నారా లోకేషకు…టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా? ఇక నుంచి పార్టీకి లోకేష్ అన్నీ తానై ముందుకు నడిపించబోతున్నారా? అంటే అవుననే సమాధానం తెలుగు తమ్ముళ్ల నోట నుంచి వస్తోంది. ఈనెల చివర్లో కడపలో నిర్వహించే మహానాడు వేదికగా లోకేష్ కు కీలక పదవి కట్టబెడుతూ ప్రకటన రాబోతున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు నిజం కాబోతున్నాయా? వాచ్ దిస్ స్టోరీ.
నారా లోకేష్..ఒకప్పుడు వేరు..ఇప్పుడు వేరు అన్నట్లుగా మారారు లోకేష్. పార్టీలో అన్నీ తానై ముందుండి నడిపిస్తున్న లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఓ కీలక నిర్ణయం తీసుకుందన్న వార్త ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఫుల్ జోష్ ను నింపిందట. కడప మహానాడు వేదికగా తీసుకునే పలు కీలక నిర్ణయాలలో లోకేష్ కు కీలక పదవిని ప్రకటించడం కూడా ఒకటి ఉందన్న చర్చ సైకిల్ పార్టీలో జోరుగా విన్పిస్తోంది.
ఎందుకంటే ఐటీ, విద్యాశాఖ మంత్రిగానే కాకుండా ఇటు పార్టీ వ్యవహారాలను కిందిస్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి వరకు చక్కబెడుతూ.. తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు పార్టీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక కాబోతుందన్న ప్రచారం జోరందుకుంది. లోకేష్కు ప్రమోషన్పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు వేదికగా సమాధానం రాబోతుందని తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారట. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని లోకేష్ కు కట్టబెట్టబోతున్నట్లు పసుపు పార్టీలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: కొత్త రూ.20 నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన
టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వరుసగా మూడు సార్లు చేసిన ఏ పదవైనా వదిలేయాల్సిందేనని ఇప్పటికే లోకేష్ ప్రకటించిన నేపధ్యంలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ఎన్నుకోనున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది… అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తనదైన ముద్ర వేస్తున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఊపిరిసలపకుండా బీజీ బిజీగా ఉండడంతో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్న లోకేష్..పార్టీలో అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారన్న చర్చ విన్పిస్తోంది. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు.
యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్న లోకేశ్
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసి పరుగులు పెట్టించేందుకు ఈ మధ్య లోకేష్ తరచుగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇంచార్జీలతో సమావేశం అవుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రతీవారం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు కూడా.
అయితే ఈ మధ్య లోకేశ్.. యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను పార్టీ పరంగా మరింత పెంచాలన్న ఆలోచనలో సీనియర్లు ఉన్నారంట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ను మరింత ఎలివేట్ చేయడానికే ఈ కొత్త పోస్ట్ అంటూ తెలుగు తమ్ముళ్లలో చర్చ నడుస్తోంది. నిన్నా మొన్నటి వరకూ లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి.
ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్?
అయితే డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ ఉండడంతో..దానిపై ఎవరూ ఎక్కడా మాట్లాడవద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు. అప్పటి నుంచి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అనే డిమాండ్ తెరమరుగైందన్న చర్చ నడిచింది. అయితే పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారన్న టాక్ పార్టీవర్గాల్లో విన్పిస్తోంది.
పార్టీ-ప్రభుత్వంలో లోకేష్ ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ సీట్ల ఖరారు, మంత్రివర్గ కూర్పు, ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేష్ పాత్ర కీలకంగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు లోకేష్ జరిపిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే ఓ కీలక మలుపని టీడీపీ నేతలు చెప్తుంటారు.
పాదయాత్ర ద్వారా రాష్ట్ర మంతా తిరిగి శభాష్ అనిపించుకున్నారు. విపక్షంలో ఉండగా చంద్రబాబు అరెస్ట్ సహా చాలా సమస్యలు చుట్టుముట్టినప్పుడు అటు పార్టీకి ఇటు కేడర్‌కు భరోసా ఇవ్వటంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ప్రధాని మోదీ తనను కలవాలని సూచించటం, ఇప్పుడు ఢిల్లీలో ప్రధాని ని లోకేష్ కలవటం పార్టీలో ప్రభుత్వంలో మరోమెట్టు పైకి తీసికెళ్లింది..
మొత్తానికి యువనేతగా ఉన్న మంత్రి నారా లోకేష్ ను పార్టీ భవిష్యత్ నేతగా ప్రొజెక్ట్ చేయడమే లక్ష్యంగా కడప మహానాడు జరగబోతుందని అంతా టాక్ విన్పిస్తోంది. అందుకే లోకేష్ కి ఈసారి మహానాడు కలకాలం గుర్తిండిపోయేలా అతి పెద్ద బహుమతినే ఇవ్వబోతుందని అంతా అంటున్నారు.