Kurnool Bus Accident
Kurnool Bus Accident : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్ ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సును వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. పలువురు ప్రయాణికులు బస్సు నుంచి బయటకు దూకి ప్రణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు తెలుస్తుండగా.. 20మంది వరకు మరణించి ఉంటారని సమాచారం.
ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. బస్సులో మంటలు రాడంతో డ్రైవర్ మరో డ్రైవర్‌ను నిద్రలేపాడు. చిన్న ప్రమాదమని భావించి మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు. మంటలు ఎక్కువ అయ్యే సరికి ప్రయాణికులను అలర్ట్ చేశారు. దీంతో ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టి కొంత మంది ప్రయాణికులు బయటపడ్డారు. ఎంత మంది చనిపోయారన్న దానిపై ఇప్పుడే చెప్పలేం. క్షతగాత్రులు కర్నూల్ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నాం. ప్రమాదంపై ఇద్దరు డ్రైవర్లను ప్రశ్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
అగ్నిప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్లలో.. మొదటి డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య, రెండో డ్రైవర్ గండిపాటి శివన్నారాయణ. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
బస్సులోని ప్రయాణికుల వివరాలు.. అశ్విన్‌రెడ్డి (బీరంగూడ), ఎం.సత్యనారాయణ (గండిమైసమ్మ), సుబ్రమణ్యం (బహదూర్‌పల్లి), ప్రశాంత్ (సూరారం), గుణసాయి (సూరారం), అర్గ బందోపాధ్యాయ్ (మియాపూర్), అందోజు నవీన్‌కుమార్ (వనస్థలిపురం), గుండా వేణు (చింతల్), శ్రీహర్ష (నిజాంపేట్), శివ (గచ్చిబౌలి), మేఘనాథ్ (ఎల్బీనగర్), గ్లోరియా శ్యామ్ (గచ్చిబౌలి), యువన్ శంకర్ రాజ్ (ఎల్బీనగర్), జి.ధాత్రి (జేఎన్టీయూ), ఎంజీ రామారెడ్డి (జేఎన్టీయూ), అమ్రిత్‌కుమార్ (జేఎన్టీయూ), మంగా చందన (మూసాపేట్ వై జంక్షన్) , సూర్య (మూసాపేట్ వై జంక్షన్), ఉమాపతి (భరత్‌నగర్), పంకజ్ (ఎర్రగడ్డ)లతోపాటు పలువురు ఉన్నారు. ఈ బస్సులో ట్రావెల్ చేసేందుకు అభిబస్, రెడ్ బస్సు ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు పటాన్ చెరువు నుంచి ప్రారంభమైంది.
ప్రమాదం నుంచి బయటపడిన వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మీ, నవీన్ కుమార్, అఖిల్, జస్మత, రమేష్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. బస్సులో మొత్తం 40మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుండగా.. ఆస్పత్రిలో 20 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీశాం. 20 మంది క్షేమంగా బయటపడ్డారని కలెక్టర్ తెలిపారు.