Kurnool : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్దం.. ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు.. పలువురు మృతి

Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

Kurnool : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్దం.. ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు.. పలువురు మృతి

Kurnool Bus Accident

Updated On : October 24, 2025 / 8:05 AM IST

Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12మంది ప్రాణాలతో బయటపడగా.. 25 మందికిపైగా దుర్మరణం చెందినట్లు సమాచారం.

ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటీన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

ద్విచక్ర వాహనంను ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగర శివారు ఉలిందకొండ క్రాస్ రోడ్డు సమీపంలోకి బస్సు రాగానే ఓ బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్ తోపాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

బస్సులో మంటలు వ్యాపించడాన్ని గమనించిన పలువురు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్, బస్సు కిటికీల నుంచి బయటకు దూకారు. పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఈ ప్రమాదంలో 25మందికిపైగా ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది.

బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకొని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, మంటలు క్రమంగా ఎక్కువయ్యాయి. ఒక్కసారిగా బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో.. డ్రైవర్ ప్రయాణికులను నిద్రలేపి అప్రమత్తం చేశాడు. దీంతో కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి బయటకు దూకారు. గాయపడిన వారు కర్నూల్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రమాద ఘటనకు కారణాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి..
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం ఘటన విషయాన్ని తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అధికారుల ద్వారా ప్రమాదంకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సీఎస్ తోపాటు పలువురు అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.