Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో తమ వారిని కోల్పోయి ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇది మరువక ముందే ఆ కుటుంబాన్ని మరో ప్రమాదం వెంటాడింది. అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రమేష్ అతడి కుటుంబం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇవాళ వారి అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తుండగా విషాదం వెంటాడింది. రమేశ్ కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా జలదంకిలో వారు ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో కారు కల్వర్ట్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వింజమూరు మండలం గోళ్లవారిపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రమేష్ కుటుంబసభ్యులు నలుగురు మరణించారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపింది.
రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయని, మంటల్లో బస్సు పూర్తిగా కాలి బూడిదైందని వెల్లడించారు. బస్సులోని కొందరు ప్రయాణికులు అతికష్టం మీద తమ ప్రాణాలను కాపాడుకోగా, మరికొందరు బయటకు వచ్చేలోపే మంటలు చుట్టుముట్టడంతో సజీవ దహనం అయ్యారు.
Also Read: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వే శాఖ అప్రమత్తం.. ఈ రైళ్లు అన్నీ రద్దు..