టికెట్ కోసం గోరంట్ల మాధవ్ పాట్లు.. ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని..

వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు కురువ గోరంట్ల మాధవ్.

Kuruva Gorantla Madhav meet CM Jagan ask MLA ticket

Gorantla Madhav Seek MLA Ticket: వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హిందూపురం వైసీపీ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ నిరాకరించడంతో కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని పార్టీ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారు. గోరంట్ల మాధవ్ మంగళవారం తాడేపల్లి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఏదో ఒక అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని అభ్యర్థించారు.

సీఎం జగన్ ను కలిసిన తర్వాత గోరంట్ల మాధవ్ మీడియతో మాట్లాడుతూ.. “హిందూపురం ఎంపీ సీటు ఇప్పటికే వేరొకరికి ప్రకటించారు. దీనిపై నేను ఇంకా మాట్లాడేందుకు ఏమీలేదు. సీఎంను ఎప్పుడు కలిసినా మాట్లాడేది ఏముంటుంది? నాకు ప్రత్యామ్నాయం ప్రాసెస్ లో ఉందని చెబుతున్నార”ని తెలిపారు. కాగా, హిందూపురం వైసీపీ లోక్‌స‌భ‌ అభ్యర్థిగా బళ్లారి మాజీ ఎంపీ జే. శాంత పేరును సీఎం జగన్ ఖరారు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు సోదరి అయిన ఆమెకు పార్టీలో చేరిన కొన్ని గంటలకే టికెట్ ఖరారు చేయడం గమనార్హం.

Also Read: సజ్జలతో గొడవపడినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే?

వివాదాల్లో చిక్కుకుని.. టికెట్ కోల్పోయి..
గత ఎన్నికలకు ముందు సంచనాలకు కేరాఫ్ గా మారిన గోరంట్ల మాధవ్ కు వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ముఖ్యంగా జేసీ బ్రదర్స్ ను బహిరంగంగా సవాలు చేసి ఆయన వార్తల్లో నిలిచారు. 2019 ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఎంపీ అయిన తర్వాత కూడా ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన వ్యక్తిగత వీడియో ఒకటి బయటకు రావడంతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలకు టార్గెట్ గా మారారు. అటు వైసీపీకి గోరంట్ల వ్యవహారం తలనొప్పిగా తయారైంది. మరోవైపు ఈసారి వాల్మీకి సామాజిక వర్గానికి హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో గోరంట్ల మాధవ్ కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని అధిష్టానాన్నిఆయన కోరుతున్నారు.

Also Read: కొన్ని గంటల క్రితమే పార్టీలో చేరిక.. ఇంతలోనే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక.. బీజేపీ మాజీ ఎంపీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్