స్థానిక ఎన్నికల వాయిదా వైసీపీ కొంపముంచిందా!!

స్థానిక ఎన్నికల వాయిదా వైసీపీ కొంపముంచిందా!!

Updated On : March 17, 2020 / 4:05 PM IST

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ రమేశ్కుమార్ వాయిదా వేయడంతో పరిస్థితులు మారిపోయాయి. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని ఎస్ఈసీ ప్రకటించడమే తరువాయి.. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. లైన్లోకి వచ్చేశారు. మీడియా ముందు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అసలు ఎస్ఈసీ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని, ఇలాంటి సమయంలో చేయాల్సింది ఇదేనంటూ కితాబు ఇచ్చేశారు. 

మీడియా ముందుకొచ్చి ఎస్ఈసీ నిర్ణయం అద్భుతః అన్న వాళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, మల్లాది విష్ణు, జోగి రమేశ్, ఉదయభాను ఉన్నారు. అంతేనా కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ కూడా ఈ వరసులోనే ఉన్నారు.  పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలుసుకోకుండా వెంటనే స్పందించడం.. ఆ తర్వాత నాలుక కరుచుకొని మాట మార్చేయడం నాయకులకు అలవాటే. ఎస్ఈసీ నిర్ణయం తీసుకోగానే మైక్ ముందుకొచ్చిన రోజా.. ఇది సరైన చర్యగా పేర్కొన్నారు. 

కరోనా వైరస్ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయానికి వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని విష్ణు, జోగి రమేశ్, సామినేని ఉదయభాను కూడా చెప్పుకొచ్చారు. అసలు ఎందుకింత హడావుడన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఎన్నికల కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్న అధికార పార్టీ.. సడన్గా ఎన్నికలు వాయిదా పడడాన్ని అస్సలు జీర్ణించుకోలేదు. ఆ విషయం రోజా అండ్ కోకు తెలిసో తెలియకో మీడియా ముందు మాట్లాడేశారు.

చాలా చోట్ల ప్రతిపక్షాలపై అధికార పార్టీ కేడర్ దాడులకు దిగిందనే విమర్శలున్నాయి. ఈ ఎన్నికలను ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిదనే ఉద్దేశంలో వైసీపీ ఉంది. ఎందుకంటే ఎక్కువ స్థానాలను సాధించి, తమ పాలనకు ప్రజా మద్దతు ఉందని నిరూపించుకోవాలని భావిస్తోందంటున్నారు. అలాంటప్పుడు ఎన్నికలను వాయిదా వేయడం ఆ పార్టీకి ఎంత మాత్రం ఇష్టముండదు. కానీ, అది తెలుసుకోలేకపోయిన రోజా లాంటి నేతలు.. ఎన్నికల కమిషన్కు మద్దతుగా చాలా మాట్లాడేశారు. 

అంతకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిద్దరు అసలు ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వమే ఎన్నికలను వాయిదా వేయించిందని వ్యాఖ్యానించారు. దీంతో రోజా ఎస్ఈసీకి మద్దతుగా మాట్లాడారట. ఎస్ఈసీ నిర్ణయంపై సీఎం జగన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన తర్వాత గానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మేల్కొనలేదు. అనవసరంగా మనం తొందరపడి ఏదేదో మాట్లాడేశామే అనుకున్నారట. కొంత సమయం తీసుకొని అంతకు ముందు మాట్లాడిన దానికి భిన్నమైన వాదన వినిపించారు. 

ఎమ్మెల్యే రోజా మరోసారి మీడియాతో మాట్లాడి.. టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా అంత సీరియస్గా లేదని చెప్పుకొచ్చారు. ఈ తొందరపాటు తతంగం వల్ల వైసీపీ నేతలు ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. ఈ విషయంలో ముందుగా స్పందించిన నేతలపై జగన్ ఫైర్ అయ్యారంటున్నారు. అసలు అంత తొందర ఎందుకంటూ మందలించారట. ఏ విషయం పైన అయినా పార్టీ నిర్ణయం తెలుసుకున్న తర్వాతే స్పందించాల్సి ఉంటుంది. కానీ, ఇలా ముందే కూసేస్తే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని జనాలు అంటున్నారు.