Ambati Rambabu Comments Lokesh
Ambati Rambabu – Lokesh : చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. టీడీపీ సర్వ నాశనం కావటానికి ప్రధాన కారణం లోకేషే అని పేర్కొన్నారు. టీడీపీని కాపాడటం ఎవరి వల్ల కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా గమనించాలని సూచించారు. నోరు పారేసుకోకుండా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
బాబు, కొడుకులిద్దరూ (చంద్రబాబు, లోకేష్) వందల, వేల కోట్లు దోచుకున్నారని ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టు చేశారని తెలిపారు. కక్షసాధింపు అవసరం లేదన్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడని నిలదీశారు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని ఎవరైనా వెంటబెట్టుకొని వెళతారా అని ప్రశ్నించారు.
వేచి చూస్తే పార్టీలో అందరికి పదవులు వస్తాయని, అందుకు అప్పిరెడ్డే ఒక ఉదాహరణ అని చెప్పారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. అక్టోబర్ 26 నుండి బస్సు యాత్ర చేస్తున్నామని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ‘మరలా జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
అనంతరం డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ శాసన మండలిలో అప్పిరెడ్డిని విప్ గా నియమించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి అభినందించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 17 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.