Madakasira MRO
Madakasira Tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని తెలుగులో వివరించి చెప్పారు ఓ తహసీల్దారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర తహసీల్దారు ముర్షావలి లంచం గురించి పాఠాలు చెప్పారు.
కార్యాలయంలోనే ఓ రైతుతో మాట్లాడుతూ లంచం ఎంత గొప్పదనే విషయంపై తహసీల్దారు హితబోధ చేశారు. ఓ వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి వచ్చాడు ఆ రైతు. రైతును లంచం బారి నుంచి బయటపడేయాల్సింది పోయి.. ఆ సమయంలోనే లంచాన్ని సమర్థిస్తూ తహసీల్దార్ ముర్షావలి చేసిన వ్యాఖ్యలు లంచగొండులు మీసం తిప్పుకునేలా ఉన్నాయి.
ఒక్కోసారి తమ ప్రాంతాలకు మంత్రులు, ఉన్నతాధికారులు వస్తారని, ఆ సమయంలో లక్షల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఆ సమయంలో వారి కోసం తనకొచ్చే జీతాన్ని ఖర్చు పెట్టాలా? అని నిలదీశారు ఆ తహసీల్దారు.
త్రేతాయుగంలోనూ లంచం ఉందయ్యా..
అనంతరం త్రేతాయుగ కాలంలోని విషయాలను ఉదాహరణగా చెప్పారు. రాముడి కాలంలోనూ లంచాలు ఉన్నాయని, మనమెంత అనేలా కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ సీఎం ఉన్నా, దేశంలో ఏ ప్రధాన మంత్రి ఉన్నా లంచాల విషయంలో ధోరణులు ఏవీ మారబోవని చెప్పారు. రెండు నెలల క్రితం రాష్ట్ర మంత్రి ఒకరు ఇక్కడికి వచ్చారని, ఆయన పర్యటనకు నలుగురు వీఆర్వోలు కలిసి రూ.1.75 లక్షలు ఖర్చు పెట్టారని అన్నారు.
వారికి తిరిగి ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. ఓ మహిళా అధికారి తమ ప్రాంతానికి వచ్చిన సమయంలోనూ ఇటువంటిదే జరిగిందని అన్నారు. ఆ అధికారిణి తిండికి కూడా బాగా ఖర్చు అయిందని తెలిపారు. ఆ ఖర్చంతా ఎవరు భరించాలని తమసీల్దారు నిలదీశారు. లంచంగా తీసుకున్న డబ్బునే తాము మంత్రులు, అధికారులకు ఖర్చు పెడతామని, సొంతంగా వేతనాల్లోంచి ఖర్చు పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ తహసీల్దారును ఉన్నతాధికారులు గత రాత్రి సస్పెండ్ చేశారు.
లంచం ఎందుకు తీసుకోవాలో షాకింగ్ కారణం చెప్పిన ఎమ్మార్వో.
మంత్రులు ఉన్నతాధికారులు పర్యటనకు వస్తే లక్షల్లో ఖర్చవుతుంది అందుకే మేము లంచం తీసుకోక తప్పడం లేదు.
— మడకశిర మండల ఎమ్మార్వో pic.twitter.com/2yuj5XkLcB
— ఆగస్థ్య✍️ ???? (@chandrasekarJSP) December 24, 2023