Tirumala : శ్రీవారి సేవలో ఎంపీ నవనీత్ కౌర్..తప్పుడు కేసులు పట్టించుకోను..ప్రజాసేవే నా లక్ష్యం
తిరుమల శ్రీవారిని మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం ఎంపీ నవనీత్ కౌర్ దర్శించుకున్నారు. నవనీత్ కౌర్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Mp Navneet Kaur In Tirumala
MP Navneet kaur In Tirumala : తిరుమల శ్రీవారిని మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం ఎంపీ నవనీత్ కౌర్ దర్శించుకున్నారు. నవనీత్ కౌర్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈక్రమంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..కుల ధ్రువీకరణ పత్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఆ ఆనందంతో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని తెలిపారు. ఓటమిని తట్టుకోలేకే ఆనందరావు నాపై తప్పుడు కేసు పెట్టారని కానీ సుప్రీంకోర్టు స్టే విధించిందని..నేను మహారాష్ట్రంలో శివసేన ప్రభుత్వంతో పోరాడుతున్నానని తెలిపారు. ఇటువంటి తప్పుడు కేసుల గురించి పట్టించుకోనని న్యాయపోరాటం చేసి నేనేంటో నిరూపించుకున్నానని..ప్రజాసేవే లక్ష్యంగా సాగుతున్న నేను ఇటువంటి ఫాల్స్ కేసుల గురించి పట్టుకోనని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టంచేశారు.
తెలుగు ప్రజల వల్లే తనకు పేరు వచ్చిందని..తాను తెలుగు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు తనవంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో కొవిడ్ విజృంభణ తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీవారిని మొక్కుకున్నానని ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు.