రూ.3వేల కోట్ల స్కామ్.. ఏపీ గృహ నిర్మాణ శాఖలో భారీ అవినీతి..!

పీఎంఏవై పథకం కింద ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు.

AP Housing Department Corruption : ఏపీ గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపైనా అధికారులు రిపోర్ట్ అందించారు. మొత్తం 3వేల 183 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు లెక్క తేల్చారు అధికారులు. హౌసింగ్ స్కీమ్ పైన ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబుకి అందించారు. కాగా, సమగ్రమైన నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటు సేకరించిన భూములపైనా సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది యంత్రాంగం. పీఎంఏవై పథకం కింద ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు.

గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. గృహ నిర్మాణ శాఖలో భారీ అవినీతి జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ఎంత మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి? ఎంత మేర నిధులు పక్కదారి పట్టాయి? అనే దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

కాగా, గృహ నిర్మాణ శాఖలో భారీ అవినీతి జరిగిందన్నది అభియోగాలు కాదు నిజాలని నిరూపించే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నివేదిక రూపంలో వెల్లడించింది. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రికి నివేదిక అందించింది కమిటీ. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన నిధులను కూడా మళ్లించినట్లు అధికారులు నివేదికలో వెల్లడించారు. మ్యాచింగ్ గ్రాంట్ ను అప్పటి జగన్ ప్రభుత్వం చెల్లించలేదని, అంతేకాకుండా కట్టని గృహాలను కట్టినట్లుగా చూపి బిల్లులు చేశారని నివేదికలో పొందుపరిచారు. లక్ష 52వేల గృహాలకు సంబంధించి నిర్మాణం చేయకుండానే గృహాలు కట్టినట్లుగా బిల్లులు చేసినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు అధికారులు.

Also Read : అలా చేస్తే ఎవర్నీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు