AP Rains
AP Rains : ఏపీని వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. రాష్ట్రం వైపు మరో ముప్పు దూసుకొస్తుంది. సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పిందని సంతోషించేలోపే.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ కు సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పింది. ఇండోనేషియా వద్ద మలక్కా జలసంధి దగ్గర ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుఫాన్‌గా మారిన తరువాత క్రమంగా బలహీనపడింది. ఈ తుఫాన్ పశ్చి దిశగా కదులుతూ ఇండోనేషియా తీరాన్ని తాకింది.
ఇవాళ సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో సెన్యార్ ముప్పు తప్పిందని ఏపీ ప్రజలు సంతోషించేలోపే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. అది వాయుగుండంగా మారి ఏపీవైపు దూసుకొస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : అద్భుతం.. మహాద్భుతం.. ఏకంగా 6 నిమిషాల 23 క్షణాల పాటు సూర్యగ్రహణం.. ఎప్పుడంటే?
శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తరువాత.. ఈ వాయుగుండం అదే దిశలో ప్రయణిస్తూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆదివారం నాటికి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. యానాం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.