×
Ad

Rain Alert : ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలేవానలు.. అప్రమత్తంగా ఉండండి.. హెచ్చరికలు జారీ

Rain Alert : మూడ్రోజులు పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Rain Alert

Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల జలమయం అవుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలకారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి రానున్న మూడ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అదేవిధంగా నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. దీని ఫలితంగా రాగల మూడ్రోజులు పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Also Read: Duvvada Srinivas : మా ఇద్దర్ని బిగ్ బాస్ కి రమ్మని అడిగారు.. నేను ఎందుకు వెళ్ళలేదంటే.. దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ వైరల్..

ఏపీలో ఇవాళ (మంగళవారం) ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల, కడప, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షంపడే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఆ సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు. పిడిగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉండటంతో ఆ సమయాల్లో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని అధికారులు సూచించారు.

సోమవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం 5గంటలకు ఏలూరు(జి) లింగపాలెంలో 74.2 మి.మీ, చింతలపూడిలో 68.7 మి.మీ, బాపట్లలో 62.5 మి.మీ, విజయనగరం(జి) పులిగుమ్మిలో 61 మి.మీ, కృష్ణా(జి) ఉయ్యూరులో 60.2మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.